హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : మంచినీటి రొయ్యల ఫైనాన్స్ బిడ్ల ఖరారు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారని మత్స్యకార సంఘాల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అక్టోబర్ 27న మంచినీటి రొయ్యల ఫైనాన్స్ బిడ్లు ఖరారు చేయాల్సి ఉన్నది. ఆ తర్వాత ఫైనల్ బిడ్లు ఖరారు చేసి నవంబర్ మొదటివారంలో రొయ్య పిల్లలను ప్రాజెక్టుల్లో వదలాలి. టెక్నికల్ బిడ్లలో టెండర్లు దాఖలు చేసిన ఏజెన్సీల తనిఖీ ముగిసి దాదాపు మూడు వారాలైంది. కానీ, నవంబర్ చివరి వారం వచ్చినప్పటికీ ఇంకా ఫైనాన్స్ బిడ్లను ఖరారు చేయకపోవడంపై మత్స్యకార సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ప్రధాన ప్రాజెక్టుల్లో రూ.29కోట్ల వ్యయంతో 10 కోట్ల మంచినీటి రొయ్య పిల్లలను మత్స్యసహకార సంఘాలకు పంపిణీ చేయాల్సి ఉన్నది. ఇందుకు ఆగస్టు నుంచి కార్యాచరణ కొనసాగుతున్నది. కానీ, చేపపిల్లలను అందించే ఏజెన్సీల ఎంపిక విషయంలో అధికారులు గోప్యత పాటిస్తున్నారని తెలుస్తున్నది. గడువు ముగిసిన తర్వాత తూతుమంత్రంగా పిల్లలను సరఫరాచేసి చేతులు దులుపుకోవాలని అధికారులు చూస్తున్నట్టు విమర్శలొస్తున్నాయి.
రొయ్య పిల్లల పంపిణీకి 7 ఏజెన్సీలు టెండర్లకు దరఖాస్తు చేశాయి. టెక్నికల్ బిడ్ల అనంతరం దరఖాస్తు చేసుకున్న ఏజెన్సీల అర్హత అంశాలను పరిశీలించినప్పుడు 4 ఏజెన్సీలకు అర్హత లేనట్టు అధికారులు నిర్ధారించినట్టు తెలిసింది. సాధారణంగా టెండర్లు దాఖలు చేసిన ఏజెన్సీల్లో టెక్నికల్ బిడ్ల పరిశీలన ముగిసిన తర్వాత వారిని జాబితా నుంచి తొలగించి ఫైనాన్స్ బిడ్ల జాబితాలో అర్హులైన వారిని చేర్చాల్సి ఉంటుంది.
కానీ, చెన్నైలోని పెరియార్ హెచరీస్, నెల్లూరుకు చెందిన సెవెన్‌హిల్స్ హెచరీస్, రాజమండ్రికి చెందిన విశిష్ట మెరైన్, భీమవరానికి చెందిన మరో హెచరీస్కి అర్హత లేనప్పటికీ ఫైనాన్స్ బిడ్లలో కొనసాగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్హులను ఎంపికచేసి వారికి రొయ్య పిల్లల పంపిణీ బాధ్యలు అప్పగిస్తే మత్స్యకార సంఘాలకు, మత్స్యకారులకు న్యాయం జరుగుతుందని, ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి త్వరగా ఫైనాన్స్ బిడ్లను ఖరారుచేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.