మెట్పల్లి, డిసెంబర్ 19 : బీఎస్ఎన్ఎల్ మెట్పల్లిలో జేటీవోగా పనిచేస్తున్న జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామానికి చెందిన పీ శ్రావణ్‌కుమార్ ఇస్రోలో టెక్నికల్ అధికారిగా ఉద్యోగం సా ధించారు. శ్రావణ్‌కుమార్ పదోతరగతి వరకు పోరుమల్లలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివారు. ఏపీఆర్జేసీలో 11వ ర్యాంకుతో నిమ్మకూర్లో ఇంటర్ పూర్తి చేశారు. 2014లో హైదరాబాద్‌లోని వాసవి ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన 3, 4 నెలల వ్యవధిలోనే బీఎస్ఎన్ఎస్లో జేఈగా ఉద్యోగం సాధించారు. ఇస్రోలో తన సేవలు అందించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఆ మేరకు బీఎస్ఎన్ఎల్లో డిపార్ట్మెంటల్ పోటీ పరీక్షల్లో ప్రతిభను చాటి జేటీవోగా ఎంపికయ్యారు. తాజాగా జాతీయ స్థాయిలో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన పోటీ పరీక్షకు హాజరై సత్తా చాటారు. జాతీయ స్థాయిలో 12 పోస్టులకు వేలాది మంది పోటీ పడగా అందులో మొదటి ర్యాంకు సాధించి టెక్నికల్ అధికారిగా ఉద్యోగం సాధించారు. ఈ నెల 29న బెంగళూర్‌లోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఉద్యోగంలో చేరనున్నట్టు శ్రావణ్‌కుమార్ తెలిపారు.