హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : గడిచిన ఏడాదికిపైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఏం చెప్తున్నారో.. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో అదే ఉన్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ చెప్పారు. ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇదే తరహా ఆరోపణలు చేసిందని, ఇప్పుడు వాటి సమాహారమే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అని చెప్పారు.
కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం ప్రకారం ఏర్పాటుచేసిన కమిషన్.. నివేదికను తయారు చేస్తున్నపుడు ఎవరిపైనైతే ఆరోపణలు వస్తాయో.. వారికి క్రాస్ ఎగ్జామినేషన్‌కు అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్‌లోని సెక్షన్ 8 బి, 8 సీల్లో ఈ విషయం స్పష్టంగా ఉన్నదని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొన్నవారికి తమ వాదన కూడా చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరానిది ఎలా అవుతుంది? ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని ఎలా అంటారు? అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి సోమవారం ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ఒక బ్యారేజ్‌లోని 3 పిల్లర్లలో మాత్రమే చీలికలు ఏర్పడ్డాయని, వాటికి రిపేర్ చేస్తే సుమారు రూ.90 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందనే సోయి లేకుండా.. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుపై విషం చిమ్ముతున్నారని ఎద్దేవా చేశారు.