Singareni | రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ఇకపై సింగరేణిలో పాలన పరుగులు పెట్టాలని సంస్థ సీఎండీ ఎన్ బలరాం సూచించారు. కోడ్ నేపథ్యంలో నిలిచిన సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగులకు అందించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. సంస్థ చేపట్టిన ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఈ విషయంలో అన్ని విభాగాలు సమన్వయంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి 25కు పైగా శాఖల అధిపతులతో గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇప్పటి వరకు ఉత్పత్తి, రవాణాలపైనే నెలవారీగా సమీక్షలు నిర్వహించడం జరిగిందని.. ఇకపై ఇతర విభాగాల పనితీరుపైనా నెలవారీగా సమీక్ష నిర్వహించడం జరుగుతుందని సీఎండీ బలరాం తెలిపారు. ఆయా విభాగాలకు అప్పగించిన పనుల పురోగతిని నెలవారీగా తెలుసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
ప్రస్తుతం ప్రైవేటు రంగంతో పోటీ పడేలా మన సామర్థ్యాలను, ఆలోచనా విధానాలను మార్చుకొని ముందుకు సాగాలని సూచించారు.
సింగరేణి వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నాయని.. అందరు అధికారులు, ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థవంతంగాసకాలంలో నిర్వహించగలిగితే సంస్థను దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలబెట్టవచ్చని సీఎండీ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా పని గంటల వినియోగంతోపాటు మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడం అత్యంత కీలకమని తెలిపారు. విధుల పట్ల అలసత్వం, లక్ష్య సాధన పట్ల నిర్లక్ష్యం చూపే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రతి నెలా ఆయా విభాగాల పనితీరులో మెరుగుదల కనిపించకపోయినా.. అప్పగించిన పనులను పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని హెచ్చరించారు. అదే సమయంలో సంస్థ ఉన్నతికి అంకిత భావంతో పనిచేసే వారికి మంచి గుర్తింపు ఇస్తామని తెలిపారు.
ఉత్పత్తితోపాటు సంక్షేమం, రక్షణకు యాజమాన్యం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, రక్షణ విషయంలో అత్యాధునిక సాంకేతికత వినియోగానికి ఖర్చుకు వెనకాడకుండా చర్యలు తీసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎండీ గుర్తు చేశారు. కంపెనీ అభివృద్ధికి ఇచ్చే మంచి సూచనలను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు.