Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రోడ్లకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. పెరిగిన ట్రాఫిక్ అవసరాలకు తగ్గట్టుగా రోడ్లను అప్గ్రేడ్ చేయకపోవడంతో ఇరుకు రోడ్లతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను రాజకీయ కోణంలో ఆలోచిస్తుండటమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాలకు అనుసంధానంగా కొనసాగుతున్న 16 రోడ్లు కాలక్రమంలో ట్రాఫిక్ పెరగడం వల్ల ఇరుకు రోడ్లుగా మారిపోయాయి. ఇందులో ప్రధానంగా పారిశ్రామికవాడలు, పర్యాటక స్థలాలు, అంతర్రాష్ట్ర రోడ్లు, జిల్లా కేంద్రాలను అనుసంధానం చేసే రోడ్లు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో కొన్ని సింగిల్ రోడ్లుగా, మరికొన్ని డబుల్ రోడ్లుగా ఉన్నాయి. సుమారు 1,617 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ రోడ్లపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
గత కేసీఆర్ సర్కారు ఈ రోడ్లను అప్గ్రేడ్ చేసేందుకు ప్రణాళికలు రచించి కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని వీటిని వెంటనే నాలుగు లేన్ల రోడ్లుగా అప్గ్రేడ్ చేయాలని కోరింది. కేంద్రం నుంచి స్పందన రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వీటిని అప్గ్రేడ్ చేయాలని భావించారు. ఈలోగా రాష్ట్రంలో ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత తొమ్మిది నెలల్లో ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడుసార్లు కేంద్రమంత్రి గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేసినా సానుకూల ఫలితం రాలేదు. కనీసం దశలవారీగానైనా మంజూరు చేయాలని కోరినా ఇంతవరకు ఒక్క రోడ్డుకు కూడా మోక్షం లభించలేదు.
నిధులు లేవని వీరు.. మీకిస్తే మాకేంటి అని వారు..
రాష్ర్టాల్లో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రోడ్ నెట్వర్క్ను అప్గ్రేడ్ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నది. ప్రాధాన్యాలకు అనుగుణంగా వాటిని జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలి. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ కోణంలో ఆలోచిస్తూ తెలంగాణ ప్రతిపాదనలను పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపించిందనే వాదనలూ లేకపోలేదు. తెలంగాణకు మేలు చేస్తే తమకు ఒనగూరే ప్రయోజనం ఏమిటి? మేలు చేయకుంటే వచ్చే నష్టం ఏమిటి? ఒకవేళ తెలంగాణలో రోడ్ నెట్వర్క్ను అభివృద్ధి చేసినా ఆ క్రెడిట్ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది కదా… అనే ధోరణితో కేంద్రం ఉన్నట్టు అధికారవర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం కూడా రోడ్ల అభివృద్ధికి సొంత నిధులు వెచ్చించకుండా సాధ్యమైనంత మేరకు కేంద్రం నుంచి నిధులు, ప్రాజక్టులు రాబట్టాలనే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది.
అప్గ్రేడ్ చేయడానికి ప్రతిపాదిత రోడ్ల వివరాలు