హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా కోర్టులో ఓ కేసు పెండింగ్‌లో ఉన్నదన్న కారణంతో హైదరాబాద్‌కు చెందిన ఎన్ పూర్ణచంద్రరెడ్డి అనే వ్యక్తికి పాస్‌పోర్టు జారీ చేయకుండా నిరాకరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నదన్న కారణంతో నిందితునికి పాస్‌పోర్టు మంజూరు లేదా రెన్యువల్‌ను నిరాకరించేందుకు వీల్లేదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని జస్టిస్ మౌసమీ భట్టాచార్య గుర్తు చేశారు. కేసు విచారణకు సహకరిస్తానని, విచారణ పూర్తయ్యేదాకా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లబోనని ఖమ్మం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు తెలిపారు. కోర్టు నుంచి తీసుకున్న సర్టిఫైడ్ అఫిడవిట్ కాపీని ఇతర పత్రాలతో జతచేసి పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ దరఖాస్తును పరిశీలించి పిటిషనర్‌కు పాస్‌పోర్ట్ జారీచేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
రాధాకిషన్‌రావు బెయిల్‌పై తీర్పు వాయిదా ; హైకోర్టులో ముగిసిన వాదనలు
హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం మాజీ పోలీస్ అధికారి పీ రాధాకిషన్‌రావు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును తర్వాత ప్రకటిస్తామని జస్టిస్ కే సుజన ప్రకటించారు.
ప్రణీత్‌రావు బెయిల్ పిటిషన్ ‘; పోలీసులకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మాజీ పోలీస్ అధికారి దుగ్యాల ప్రణీత్‌కుమార్ అలియాస్ ప్రణీత్‌రావు శుక్రవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో తనకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే దర్యాప్తు సంస్థ హడావుడిగా చార్జిషీట్ దాఖలు చేసిందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులకు నోటీసులు జారీచేసిన జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి.. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేశారు.