హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన సర్కారు జూనియర్ కాలేజీల పోస్టుల మంజూరుకు గ్రహణం పట్టింది. కొత్త పోస్టుల మంజూరును ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. ఫలితంగా కాలేజీలను లెక్చరర్లు, సిబ్బంది కొరత పట్టి పీడిస్తున్నది. రాష్ట్రంలో 18 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కొత్తగా ఏర్పాటయ్యాయి. 2024 -25 విద్యా సంవత్సరంలోనే 8 కొత్త కాలేజీలు వచ్చాయి. ఈ కాలేజీలకు ఒక్కటంటే ఒక్క పోస్టును కూడా సర్కారు మంజూరు చేయలేదు. కొంత కాలం క్రితం ఇంటర్ విద్యాశాఖ అధికారులు 18 కాలేజీలకు 273 పోస్టుల మంజూరు కోసం సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. ఈ ఫైల్ క్యాబినెట్ ముందుకు కూడా చేరింది. నెల రోజుల్లో రెండు సార్లు క్యాబినెట్ భేటీ అయ్యింది. కానీ పోస్టుల మంజూరుకు ఆమోదం మాత్రం లభించలేదు. ఈ కాలేజీల్లో క్లాసులు నిర్వహించలేని పరిస్థితి నెలకొన్నది. గత్యంతరం లేక ఇతర కాలేజీల అధ్యాపకులను తాత్కాలికంగా డిప్యూటేషన్‌పై పంపించి మమ అనిపిస్తున్నారు.
ఇదీ పరిస్థితి
వీటికేమో చకచకా..
సీఎం సహా మంత్రుల నియోజకవర్గాల్లోని కొత్త కాలేజీలకు చకాచకా పోస్టులు మంజూరవుతున్నాయి. కానీ మిగతా వాటికి మాత్రం మొండిచెయ్యి చూపిస్తున్నారు. సీఎం నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని హకీంపేట (దుద్యాల మండలం)లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి 20 టీచింగ్, 11 నాన్ టీచింగ్ పోస్టులు ఇటీవలే మంజూరుచేశారు. బొంరాస్‌పేట, దౌల్తాబాద్ కాలేజీలకు ఒక్కో కాలేజీకి 15 బోధన, బోధనేతర పోస్టులు, సొంతభవన నిర్మాణం కోసం ఒక్కో కాలేజీకి రూ.7 కోట్ల వరకు నిధులిచ్చారు. ఇదే నియోజకవర్గంలోని కొత్తపల్లికి జూనియర్ కాలేజీ మంజూరు చేయడంతో పాటు, ఈ కాలేజీకి బోధన, బోధనేతర పోస్టులు, సొంత భవనం నిర్మాణానికి రూ. 7.13 కోట్ల నిధులిచ్చారు. మంత్రి తుమ్మల సిఫారసుతో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి పోస్టులు మంజూరయ్యాయి. మిగతావన్నీ అటకెక్కాయి.