Street Vendors | హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని వీధి వ్యాపారులను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రోడ్డున పేడేస్తున్నది. ఉపాధి లేకుండా చేసి చిరువ్యాపారులను వేధింపులకు గురి చేస్తున్నది. నగరంలోని మెట్టుగూడ-తార్నాక రోడ్డుకు ఇరువైపులా బట్టలు, పండ్లు, భోజనం అమ్ముకుంటున్నవారి దుకాణాలు తొలగించింది. దీంతో 125 కుంటుంబాలకు ఉపాధి కరువైంది. దుకాణం నిర్వహించడానికి తెచ్చిన అప్పు కట్టలేక లలిత అనే మహిళ గుండెపోటుతో మరణించింది.
ఉపాధి కల్పించి ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారిని రోడ్డున పడేయడంతో.. బాధితులు ఆదివారం తెలంగాణ భవన్‌కు వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్‌వెండర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున వినతిపత్రం అందజేశారు. తాము వ్యాపారం కొనసాగించుకునేలా సాయం చేయాలని విన్నవించారు. తమను ఆదుకోవాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డిని కలిసి విన్నవించినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమకు ఉపాధి లేకుండా చేసి ఇబ్బందుల పాలు చేస్తున్నదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం చేసుకున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం తమను స్ట్రీట్ వెండర్స్గా గుర్తించి వీధి వ్యాపారుల చట్టం కింద గుర్తింపు కార్డులు కూడా జారీ చేసినట్టు పేర్కొన్నారు. తమకు శిక్షణతోపాటు రుణాలు కూడా ఇచ్చినట్టు గుర్తుచేశారు. పోలీసులకు ఈ వివరాలన్నీ పత్రాలతో సహా చూపించినా తమ దుకాణాలను తొలగించారని ఆవేదన వ్యక్తంచేశారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు బీ స్వప్న, ఉపాధ్యక్షుడు ఖాదర్ అలీ, జనరల్ సెక్రటరీ రమేశ్, జాయింట్ సెక్రటరీ లక్ష్మి, కొండయ్య, రమేశ్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.