సిటీబ్యూరో, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ) : శ్రావణం వచ్చిందంటే పర్వదినాలకు రంగం సిద్ధమవుతున్నట్టే. శ్రావణ మాసం మొదలు కావడంతో రాబోయే వరుస పండుగల కోసం మహిళామణులు ఇప్పటినుంచే షాపింగ్‌కు సిద్ధమవుతున్నారు. అందుకే వారు మెచ్చేలా వస్త్ర దుకాణాలు ముస్తాబవుతున్నాయి. కేజీల లెక్కన చీరలు, ఒకటి కొంటే మరోకటి ఫ్రీ ఇలా అనేక ఆఫర్లతో మహిళలను షాపింగ్ మాల్స్ ఆకట్టుకుంటున్నాయి. శ్రావణంలో అన్నింటికన్నా ముఖ్యంగా మగువలను ఆకర్షించే బంపర్ ఆఫర్ ఏదైనా ఉంటే అది కేజీల్లో చీరలను విక్రయించడమే. కొన్ని షాపులు ఫ్యాన్సీ డ్రెస్సులపై 70 శాతం వరకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. శ్రావణం రాయితీల్లో భాగంగా ఫ్యాంట్, షర్ట్‌లను కొన్ని మాల్స్ సగం ధరకే విక్రయిస్తున్నాయి. సికింద్రాబాద్, అమీర్‌పేట్, కోఠి, దిల్షుక్నగర్, అబిడ్స్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో వస్త్ర నిలయాలు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. సాధారణంగా నగరంలో ఏ రోజైనా షాపింగ్ మాల్స్ సందడి తలపిస్తుంటాయి. ముఖ్యంగా పండుగలు సమీపిస్తున్న వేళ మాల్స్ కిటకిటలాడుతున్నాయి.
ఫ్యాషన్ దుస్తుల ఎంపికలో చాలా మంది అమ్మాయిలు ప్రస్తుత ట్రెండ్‌ను అనుసరించడానికే మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లోకి కొత్తకొత్త డిజైన్లు ఏమొచ్చినా వాటిపై లుక్కేస్తున్నారు. ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలు తమ డ్రెస్సుల సెలక్షన్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలో ఫ్యాషన్ డిజైనర్లను సైతం సంప్రదిస్తూ ప్రత్యేక దుస్తులను తయారు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తమకు నప్పే దుస్తులను ఎంచుకోవడంలో ధరలకు వెనకాడటం లేదు. ప్రస్తుతం అమ్మాయిలు ఎక్కువగా వెస్టర్న్ స్కర్ట్స్, షార్ట్స్, లాంగ్డ్రెస్సెస్, ఫ్యాన్సీ డ్రెస్సెస్ను పార్టీలలో ధరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చాలా రకాల డిజైన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇంకా వెరైటీ కావాలనుకునే వారు ఫ్యాషన్ డిజైనర్లను సంప్రదిస్తే వారికి నచ్చిన విధంగా డిజైన్ చేసి ఇచ్చే సౌలభ్యం నగరంలో అందుబాటులో ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ కాలం అమ్మాయిలు, మహిళలు వేడుకను బట్టి డ్రెస్సులను ఎంపిక చేసుకుంటున్నారు. తద్వారా సంబంధిత దుస్తుల మాల్స్‌కు విపరీతంగా డిమాండ్ పెరుగుతున్నది. మరోవైపు చేనేత దుస్తులకు సైతం మార్కెట్లో ప్రత్యేక ఆదరణ ఉంది. ప్రత్యేక దుకాణాలు వాటి విక్రయానికి వెలిశాయి. హ్యాండ్లూమ్స్ పై విభిన్న రకాల స్టోన్స్ జత చేసి డిజైన్లను అద్దుతున్నారు.
షాపింగ్ మాల్స్‌తో నగర రూపురేఖలు మారిపోతున్నాయి. నగరవాసుల కొనుగోలు శక్తి పెరగడంతో వారు షాపింగ్, వినోదంపై అత్యధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. వారి ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్స్ తమ కార్యాలయాలను నగరంలో ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న షాపింగ్ మాల్స్‌కు ధీటుగా ఒకే చోట వినోదం, షాపింగ్ ఉండేలా మాల్స్ వెలుస్తున్నాయి. కుటుంబ సమేతంగా అవసరమయ్యేవన్నీ అందుబాటులో ఉంచుతున్నాయి. చుట్టపక్కల రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను ఇవి అంతగా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే మాల్స్ నిర్మాణంలో హైదరాబాద్ దూసుకుపోతుంది. ఐటీ కారిడార్లోనే ఇవి అత్యధికంగా వస్తున్నాయి. రిటైల్ స్పేస్‌లో వ్యవస్థీకృత మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. బ్రాండెండ్ దుకాణాల రాకతో వీటికి డిమాండ్ పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వినోదం, షాపింగ్, ఆహారం వరకు అన్నీ ఒకే చోట సౌకర్యంగా ఉండటంతో సందర్శకులు ఉదయం నుంచి రాత్రి వరకు మాల్స్‌లోనే గడుపుతున్నారు. ఆదాయాలు పెరగడం, జీవనశైలిలో వచ్చిన మార్పులు కూడా వీటికి బాగా కలిసోస్తుంది. హైదరాబాద్ షాపింగ్ దుకాణాలు తమ బ్రాండ్లను నగరవాసులకు పరిచయం చేయడంలో పోటీపడుతున్నాయి. చాలా మంది ఇప్పుడు బ్రాండెడ్ దుస్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.