మర్రిగూడ, ఫిబ్రవరి 8: తమకు న్యాయం జరిగే వరకు కట్ట మీది నుంచి కదలబోమని నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెం ప్రాజెక్టు ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం భూనిర్వాసితులు తేల్చిచెప్పారు. మూడో రోజు శనివారం ఎక్కడికక్కడ టిప్పర్లను నిలిపివేసి ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా 32 మంది నిర్వాసితులకు ప్లాట్లు, 15 మందికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. గ్రామంలో 289మంది నిర్వాసితులు ఉండగా.. 257 మందికి చింతపల్లిలో ప్లాట్లు కేటాయించారని తెలిపారు. ప్లాట్లు, ప్యాకేజీ ఇవ్వకుండా ఖాళీ చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లు ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. 10వ తేదీలోపు ఖాళీ చేసినవారికి కాంట్రాక్టర్‌తో మాట్లాడి రూ.20 వేల చొప్పున ఇప్పిస్తామని, ఆ తర్వాత తమకు సంబంధం లేదని అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
చావనైనా చస్తం..
మా గ్రామంలో ఇంకా 32 మందికి ప్లాట్లు, 15 మందికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రావాలి. ప్లాట్లు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే గ్రామాన్ని విడిచిపెట్టిపోతం. అధికారులు, కాంట్రాక్టర్ మా పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నరు. మేం ఎంతకాడికైనా తెగిస్తం. నష్టపరిహారం అందేవరకు పనులు జరగనివ్వం. చావనైనా చస్తం కానీ, ఒత్తిళ్లకు మాత్రం లొంగం.
-మాదగోని సత్తయ్య,నర్సిరెడ్డిగూడెం నిర్వాసితుడు