యాదాద్రి, ఏప్రిల్ 23: యాదగిరిగుట్ట రామలింగేశ్వరాలయంలో రుద్రయాగాన్ని అనుసరించి పార్ధ లింగేశ్వరస్వామి వారికి శనివారం మహాలింగార్చన నిర్వహించారు. మహాన్యాస పారాయణాలను వేదమూర్తులు.. అత్యుత్తమమైన అర్చక బృందంతో స్మార్తాగమశాస్త్ర రీతిలో జరిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి అనుబంధ ఆలయమైన రామలింగేశ్వరాలయ పంచాహ్నిక మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజు శనివారం ఉదయం 9 గంటలకు యాగశాల ద్వారతోరణ పూజ నిర్వహించారు. స్థాపిత దేవతాహవనం, వేదమూలమంత్ర హవనం, వేదస్వాహాకారాలు, విశిష్టమైన కలశ పూజలు జరిపారు.
సాయంత్రం 5 నుంచి 8:30 గంటల వరకు ప్రాసాదవాస్తు శాంతి కార్యక్రమాన్ని అర్చక బృందం, రుత్విక్ బృందం ప్రత్యేకంగా చేపట్టింది. సుమారు 64 రాజోపచారాలు ప్రత్యేకంగా నిర్వహించారు. స్ఫటిక లింగాల కు బియ్యం, ధాన్యంతో ధాన్యాధివాసాలు చేపట్టారు. సుమధురంగా నామసంకీర్తన జరిగింది. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో గీత, ప్రధానార్చకుడు నల్లన్‌థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, శివాలయ ప్రధాన పురోహితుడు గౌరిభట్ల సత్యనారాయణశర్మ, ప్రధానార్చకులు నర్సింహ్ములుశర్మ తదితరులు పాల్గొన్నారు. దేవస్థానంలో బయోమెట్రిక్ సిస్టం అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే కొండ కింద ఉన్న నరసింహస్వామిసదన్, పాతగుట్ట ఆలయం, కొండపైన రిసెప్షన్, ఈవో కార్యాలయం వద్ద బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటుచేశారు.
విమాన గోపురం స్వర్ణతాపడానికి అమరేందర్‌రెడ్డి రూ.లక్ష విరాళం
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి హైదరాబాద్‌కు చెందిన వేముల అమరేందర్‌రెడ్డి రూ.1,00,116 విరాళం సమర్పించారు. ఆ నగదును శనివారం యాదాద్రిలో ఆలయ ఏఈవో గజవెల్లి రమేశ్‌బాబుకు అందజేశారు.