హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): మహిళలపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో సినీనటుడు శివాజీ… రాష్ట్ర మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. దండోరా సినిమా కార్యక్రమంలో శివాజీ మహిళల వస్త్రధారణపై అసభ్యంగా మాట్లాడారంటూ పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమాల్లో వివాదం, భిన్నవాదనలు ముదిరిన నేపథ్యంలో శివాజీకి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని అదేశించింది. ఈ మేరకు శనివారం కమిషన్ ఎదుట శివాజీ హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ దండోరా సినిమా వేడుకలో తన మాటలు తప్పుడు అర్థంలో వ్యాప్తి చెందాయని తెలిపారు.
ఈ వ్యవహారంలో ఎవరైనా బాధపడితే క్షమించాలని ఇప్పటికే కోరినట్టు వెల్లడించారు. కమిషన్ మళ్లీ విచారణకు పిలిస్తే హాజరవుతానని చెప్పారు. తనకు కావాల్సిన వాళ్లు కూడా తనపై కుట్రచేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని స్పష్టంచేశారు. ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ ప్రపంచంలో ఫ్యాష న్ అనేక రకాలుగా ఉంటుందని, మహిళలను కట్టడి చేయడం కంటే రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. సినీ నిర్మాత శ్రీనివాస్‌కుమార్ నాయుడు మాట్లాడుతూ ఆలోచనలు మంచివైతే.. మంచి జరుగుతుందని చెప్పారు.