CM KCR | ముంబై/హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర గులాబీ శ్రేణుల్లో బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నయాజోష్ నింపారు. ర్యాలీలతో కార్యకర్తలు కదంతొక్కారు. నినాదాలతో హోరెత్తించారు. అధినేతకు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ రాకతో పర్యటన ఆసాంతం వారిలో ఆనందం వెల్లివిరిసింది. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా వాటేగాఁవ్ గ్రామంలోని ఇండియన్ మాక్సింగోర్కిగా పేరొందిన అన్నా భావ్సాఠే జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు కేసీఆర్ సోమవారం బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి కొల్హాపూర్ విమానాశ్రయానికి మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ పుణే డివిజన్ సమన్వయకర్త బీజే దేశ్‌ముఖ్, ప్రొఫెసర్ రోహిత్ సాక్షి, సంజయ్ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు ముర్కుటే, అన్నా సాహెబ్ మానే, పార్టీ సీనియర్ నేతలు భగీగిరథ్ బాలే, ఘన్‌శ్యాం శేలార్, విలాస్పాటిల్, బాలసాహెబ్ తదితరులు సీఎం కేసీఆర్‌కు అపూర్వస్వాగతం పలికారు. అనంతరం కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకొన్న సీఎం కేసీఆర్‌కు వేదపండితులు పూర్ణకుంభ స్వాగతంతో పలికారు. ఆయన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనాలు పలికారు.
అన్నా భావ్సాఠేకు ఘన నివాళి
మహారాష్ట్ర యుగకవి, దళిత సాహిత్య చరిత్రలో పేరేన్నికగన్న అన్నాభావ్ సాఠేకు సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. జయంతి వేడుకలకు వాటేగావ్ వెళ్లిన ఆయనకు తొలుత సాంగ్లీ జిల్లా యంత్రాంగం తరఫున ఆర్డీవో శ్రీనివాస్ అర్జున్, తహసీల్దార్ ప్రదీప్ ఉబాలే స్వాగతం పలికారు. అనంతరం అన్నా భావుసాఠే విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నాభావు సాఠే ఇంటికి వెళ్లి ఆయన కోడలు సావిత్రబాయి సాఠే, మనవడు సచిన్ సాఠేతో ముచ్చటించారు. అనంతరం జరిగిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఆ తర్వాత కొల్హాపూర్‌లోని ఛత్రపతి సాహూ మహరాజ్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు.
మహారాష్ట్రకు ఆశాదీపం బీఆర్ఎస్
సాంగ్లీలోని పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇస్లాంపూర్‌లో రఘునాథ్ దాదాపాటిల్ మధ్యాహ్న భోజనానికి సీఎం కేసీఆర్‌ను తన ఇంటికి ఆహ్వానించారు. అనంతరం ‘పుడారి’ పత్రిక యాజమాని ప్రతాప్సింహ్ జాదవ్ కేసీఆర్‌ను తన ఇంటికి ఆహ్వానించి తేనేటీ విందు ఇచ్చారు. మహారాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మాడల్‌పై విస్తృత చర్చ జరుగుతున్నదని, మహారాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తమ ఆశాదీపంగా చూస్తున్నారని కేసీఆర్‌తో భేటీ సందర్భంగా వారు పేర్కొన్నారు.
బీఆర్ఎస్కు షేత్కరీ సంఘటన్ జై
మహారాష్ట్ర షెత్కరీ సంఘటన్ అధ్యక్షుడు రఘునాథ్ దాదాపాటిల్ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మహారాష్ట్రలోని షెత్కరీ సంఘటన్ ఐక్యకార్యాచరణ ద్వారా త్వరలో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని ఈ సందర్భంగా రఘునాథ్ దాదాపాటిల్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ వెంట అన్నాభావుసాఠే మనవడు సచిన్ భావ్సాఠే, మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు శంకరన్న దోండ్గే, మాణిక్ కదం, బీజీ దేశ్‌ముఖ్, భగీరథ్ బాల్కే, హరిభావ్ రాథోడ్, ఘన్‌శ్యాం, కదీర్ మౌలానా, భానుదాస్ ముర్కుటే, బీఆర్ఎస్ మహారాష్ట్ర కన్వీనర్ వంశీధర్‌రావు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.