అక్కన్నపేట, కలకచర్ల, డిసెంబర్ 17 : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో బుధవారం జరిగిన మూడో విడత ఎన్నికల్లో రామవరానికి చెందిన ఎడమల్ల మాధవీలత అమెరికా నుంచి , ఎడబోయిన శేషుకుమార్‌రెడ్డి ఆస్ట్రేలియా నుంచి వచ్చి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారు. అదేవిధంగా శతాధిక వృద్ధుడు ఎడమల సిద్ధారెడ్డి ఓటు వేసి ఆదర్శనంగా నిలిచాడు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం బండవెల్కిచర్లకు చెందిన సిద్దోటం నవీన్‌కుమార్ ఓటు కోసం ఐర్లాండ్ నుంచి బుధవారం గ్రామానికి వచ్చి ఓటు వేశాడు.
జమ్మికుంట, డిసెంబర్17: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మాచనపల్లిలో వేర్వేరు వార్డుల్లో పోటీ చేసిన మూడు జంటలు గెలిచారు. అందులో ఒకరు ఉప సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు. మాజీ ఉప సర్పంచు దొంతరవేన రమేశ్ 11వ వార్డు, అతని భార్య మమత 8వ వారు, వేల్పుల శ్రీకాంత్ 1వ వార్డు, అతని భార్య జాగృతి 10వ వార్డు, పర్లపల్లి భరత్ 3వ వార్డు, అతని భార్య స్వప్న 9వ వార్డులో పోటీ చేయగా, ఈ ఆరుగురు గెలిచారు. దొంతరవేన రమేశ్ ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు.
నర్సంపేట, డిసెంబర్17: వరంగల్ జిల్లా ఖానాపురం 10వ వార్డు సభ్యులుగా బీఆర్ఎస్ బలపర్చిన ఇలపొంగు కొమురమ్మ పోటీ చేసింది. ఆమె కూతురు తిక్క శ్యామల కూడా ఇదే వార్డు నుంచి బరిలో నిలిచింది. ఈ ఎన్నికలో కూతురు 2 ఓట్లతో గెలిచింది.