Dusharla Satyanarayana | తన వ్యవసాయ క్షేత్రంలో గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై గొర్ల కాపర్లు దాడికి దిగారు. కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
పర్యావరణవేత్త, జల సాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురంలో తనకు వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల భూమిలో 15 ఏళ్లుగా కష్టపడి వేలాది మొక్కలను నాటి అటవీ ప్రాంతంగా తీర్చిదిద్దాడు. ఎందరో విద్యార్ధులు, పర్యావరణవేత్తలు పరిశోధనలు చేస్తున్న ఈ అటవీ ప్రాంతంలో బయ్య గంగయ్య, మల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులు చెట్లను నరికి గేదెలను, గొర్లను మేపుతున్నారు.
గొర్రెలను మేపుతుండగా అక్కడికి వెళ్లి అడ్డుకున్న సత్యనారాయణపై కుటుంబ సభ్యులతో కలిసి గొర్ల కాపర్లు కర్రలతో దారుణంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దుశ్చర్ల సత్యనారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తనపై దాడి చేసిన గంగయ్య, మల్లయ్య, రోషాలు, సుమలత, యశ్వంత్, అనూషలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.