హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డు-2025కు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక కార్టూనిస్టు మృత్యుంజయ్ ఎంపికయ్యారు. ఆయనతోపాటు సీనియర్ ఆర్టిస్ట్ చిత్రశేఖర్ ఈ స్మారక అవార్డులు అందుకోనున్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సం జరుగనున్నది. ఈ అవార్డు కింద రూ.10,116 నగదు, మెమెంటో, ప్రశంసాపత్రం ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రజాశక్తి పూర్వ సంపాదకుడు వినయకుమార్ హాజరుకానున్నారు.
‘ఏ బ్రష్ అగైనెస్ట్ ప్రెజుడస్ : ది ప్రొ-పీపుల్ ఆర్ట్ ఆఫ్ శేఖర్’ అనే అంశంపై సీనియర్ జర్నలిస్టు, రచయిత కేవీ కూర్మనాథ్ శేఖర్ స్మారకోపన్యాసం చేస్తారు. విశిష్ట అతిథులుగా తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి తిప్పర్తి యాదయ్య, ప్రముఖ వాగ్గేయకారుడు చింతల యాదగిరి, కార్టూనిస్ట్ శంకర్, ఆర్టిస్ట్ కూరెళ్ల శ్రీనివాస్, చంద్రకళా శేఖర్ పాల్గొంటారు. ప్రతి సంవత్సరం శేఖర్ జయంతి సందర్భంగా ఈ అవార్డును ఆయన కుటుంబసభ్యులు, మిత్రులు, ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్ కలిసి అందిస్తున్నాయి.