హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పటిలా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసి కాదు.. ఓ వ్యక్తి చేసిన పనితో. అదేంటని అనుకుంటున్నారా.. అతి తక్కువ సమయంలో మెట్రో స్టేషన్లన్నీ చుట్టివచ్చారు. ఢిల్లీకి చెందిన శశాంక్ మను (Shashank Manu) అనే పరిశోధకుడు హైదరాబాద్ మెట్రో మూడు కారిడార్లలోని 57 స్టేషన్ల పరిధిలో 2 గంటల 41 నిమిషాల 31 సెకన్లలో ప్రయాణించారు. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు. ఆయన హైదరాబాద్లోని అన్ని మెట్రో రైలు స్టేషన్లను వేగంగా చుట్టేసి, ఈ రికార్డును సొంతం చేసుకున్నారు.
గతంలో 15 గంటల 22 నిమిషాల్లో ఢిల్లీ మెట్రోలోని 286 స్టేషన్లను సందర్శించారు. 2021, ఏప్రిల్ 14న ఉదయం 5 గంటలకు మెట్రో బ్లూ లైన్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన శశాంక్.. గ్రీన్ లైన్ సమీపంలో ఉన్న బ్రిగేడియర్ హోషియర్ సింగ్ స్టేషన్ వద్ద రాత్రి 8.30 గంటలకు తన మెట్రో ప్రయాణాన్ని ముగించాడు. భారతదేశంలో ప్రపంచ స్థాయి మెట్రో సదుపాయాలను తెలియజెప్పేందుకు, ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు శశాంక్ మను మెట్రో నగరాల్లో ఇలా ప్రయాణాలు చేస్తున్నారు.