హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీ రెడ్కో) చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ ఏ శరత్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం సీఎస్ జీవో విడుదల చేశారు. శరత్ రెండేండ్ల పాటు టీజీ రెడ్కో చైర్మన్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. శరత్ జూలై 31న పదవీ విమరణ పొందారు. అంతలోనే ప్రభుత్వం ఆయనను రెడ్కో చైర్మన్‌గా నియమించింది. రిటైర్డ్ అధికారులకు పదవులివ్వడం పట్ల రేవంత్‌రెడ్డి గతంలో పలుమార్లు అభ్యంతరం వ్యక్తంచేశారు.
కానీ అధికారంలోకి వచ్చాక రిటైర్డ్ అధికారులకే పదవులు అప్పగి స్తున్నారు. ఇప్పటికే ఐపీఎస్ అధికారి సందీప్‌శాండిల్య, ఎన్వీఎస్రెడ్డి, నర్సింహా చార్యులు, పెంటారెడ్డి, గుర్రం మల్సూరు, గణపతిరెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, మిషన్‌భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డిలను మళ్లీ కొనసాగిస్తున్నారు. ఇప్పుడీ జాబితాలోకి శరత్ చేరారు. నాగర్‌కర్నూల్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి శరత్ పాదాభివందనం చేసిన విషయం తెలిసిందే. ‘కాళ్లు మొక్కిన రిటైర్డ్ ఐఏఎస్‌కు మళ్లీ పదవినిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం’ అంటూ సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.