నంగునూరు, డిసెంబర్ 17 : ఎదుటి వారికి సహాయపడాలంటే ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండాల్సిన పనిలేదని, తోటి వారికి తన వంతు బాధ్యతగా సేవ చేయాలనే తపన ఉంటే చాలని ఓ వృద్ధురాలు నిరూపించింది. ముదిమిలో తనకే అండా ఉండాల్సిన సమయంలో సమాజ సేవకు నేను సైతం అంటూ తన పెన్షన్ డబ్బులను ప్రభుత్వ పాఠశాలకు అందజేసిన ఆ పండుటాకు తన సేవా గుణాన్ని చాటుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే..సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు సుద్దాల అండాళమ్మ తన గొప్ప మనసు చాటుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్తో బతుకువెళ్లదీస్తున్న ఆమె..తనకు ఈ నెల వచ్చిన రూ.2,016 లను గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు విరాళంగా ఇచ్చారు.
కరోనా కారణంగా ప్రైవేటు పాఠశాలలు మూతపడడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాల కోసం, బోధనకు గాను సాయం అందించాలన్న ఉపాధ్యాయులు పిలుపు మేరకు ఆమె స్పందించారు. తనకు వచ్చిన ఆసరా పింఛన్ మొత్తాన్ని పాఠశాలకు అందించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. వృద్ధురాలి దాతృత్వాన్ని ఉపాధ్యాయులతో పాటు గ్రామస్తులు అభినందించారు.