మెదక్ అర్బన్/సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 6: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద సోమవారం చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యార్థులు పెద్దఎత్తున ధర్నాకు దిగారు. కలెక్టరేట్ ప్రవేశ ద్వారం నుంచి ప్రాంగణంలోకి చొచ్చుకుపోయారు. దీంతో కలెక్టరేట్లోని ఏ- బ్లాక్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. విద్యార్థులు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. శాంతించిన విద్యార్థులు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజేశ్, కార్యదర్శి సతీశ్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్లో భాగంగా మెదక్ జిల్లాలో వంద మంది విద్యార్థులు మెదక్, తూప్రాన్‌లోని ప్రైవేట్ పాఠశాలలో చదువుకొంటున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో ప్రైవేట్ యాజమాన్యం అనుమతించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్‌కు సమస్యను విన్నవించారు. అంతకుముందు వారు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.