హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం నిధులు కేటాయించకుండా ని ర్వీర్యం చేస్తున్నదని ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య విమర్శించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగారపు రజినీకాంత్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా శ్రీజన్ భట్టాచార్య, తెలంగాణ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ తెలంగాణలో విద్యారంగం గాడితప్పుతున్నదని, విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం బాధాకరమని తెలిపారు.
పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంతో వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారని చెప్పారు. గురుకులాలు, కస్తూర్భాగాంధీ పాఠశాలలు,మాడల్ సూళ్లు సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు రోడ్ల మీదకు రావడం ప్రభుత్వ పనితీరును తెలియజేస్తున్నదని మండిపడ్డారు. విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వం పునాదులు కదులుతాయని, విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు బతికి బట్ట కట్టలేదన్న చరిత్రను మర్చిపోవద్దని హెచ్చరించారు.