Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో/పహాడిషరీఫ్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ఎంఎంటీఎస్ రైలులో జరిగిన ఘోరాన్ని మరువకముందే హైదరాబాద్లో మరో లైంగికదాడి ఘటన చోటుచేసుకున్నది. కూరగాయల మార్కెట్లు చూపిస్తానంటూ నమ్మించి, కారులో లిఫ్ట్ ఇచ్చిన ఓ కామాంధుడు విదేశీ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మీర్పేట్కు చెందిన మంగళగిరి శరత్ చంద్ర చౌదరి ఇటలీలోని మెస్సిన యూనివర్సిటీలో చదువుతున్నాడు. జర్మనీకి చెందిన అతని స్నేహితులు బాధిత యువతి, మరో యువకుడు మాక్సిమిలన్ కియువాన్లియులు ఇటీవల హైదరాబాద్కు వచ్చారు. శరత్చంద్ర ఇంట్లోనే వారు ఉంటున్నారు. సోమవారం సాయంత్రం యువతి, మాక్సిమిలన్ బయటకు వెళ్లారు. యాఖత్పురాకు చెందిన మహ్మద్ అబ్దుల్ అస్లాం(25) మార్కెట్లు చూపిస్తానని నమ్మించి వారికి కారులో లిఫ్ట్ ఇచ్చాడు. కారులో అప్పటికే ఐదుగురు మైనర్ బాలురు ఉన్నారు.
వారంతా కాసేపు సిటీలో తిరిగారు. మామిడిపల్లిలో యువతి తప్ప అందర్నీ సెల్ఫీలు తీసుకోవాలని కారులో నుంచి అస్లాం దింపాడు. 100 మీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రాంతానికి కారు తీసుకెళ్లి, చంపేస్తానంటూ బెదిరించి యువతిపై అస్లాం లైంగికదాడికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి కారును వెనక్కి తీసుకురాగా, బాధితురాలు మాక్సిమిలన్కు జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది. వారి స్నేహితుడు శరత్ చంద్ర సాయంతో సోమవారం అర్ధరాత్రి పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలికి వైద్య చికిత్స చేయించారు. మహిళా పోలీసు అధికారులు యువతితో మాట్లాడి నిందితుడి కారు వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలి, మాక్సిమిలన్ల ఫోన్లలో ఉన్న ఫొటోల ఆధారంగా నిందితుడు యాఖత్పురాలోని ఎస్ఆర్టీ కాలనీలో నివాసముంటున్నట్టు గుర్తించి, మంగళవారం అరెస్ట్ చేశారు.
మహిళలపై అఘాయిత్యాలు ఆందోళనకరం ;ప్రభుత్వం మొద్దునిద్రను వీడి భద్రతపై దృష్టిసారించాలి: కవిత
తెలంగాణలో మహిళలపై వరుస దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదిక గా పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా లో ఆలయం వద్ద, హైదరాబాద్లో జర్మనీ పర్యాటకురాలిపై జరిగిన అ ఘాయిత్యాలు ఆవేదన కలిగిస్తున్నాయని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే మొద్దునిద్రను వీడి రాష్ట్రంలో మహిళల భద్రతపై దృష్టిసారించాలని సూచించారు.