మలక్‌పేట, జూలై 24: మలక్‌పేటలోని ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహ పాఠశాలలో ఎనిమిదేండ్ల బాలికపై స్కావేంజర్ (మరుగుదొడ్లను శుభ్రపరిచేవాడు) అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన బాలిక(8) ఆస్మాన్‌ఘడ్‌లోని ప్రభు త్వ అంధ బాలికల వసతి గృహ పాఠశాలలో మూడో తరగతి చదువుతుంది. ఈ నెల 7న బాలికకు రక్తస్రావం కావడంతో హాస్టల్ వార్డెన్ తల్లిదండ్రులను పిలిపించి ఇంటికి పంపించారు.
బాధితురాలిని చికిత్స కోసం నిలోఫర్ దవాఖానకు తీసుకురాగా, పరీక్షించిన వైద్యులు బాలికపై లైంగిక దాడి జరిగిందని నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు 16న మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు. బాధితురాలితో పాటు ఆమె ముగ్గురు స్నేహితులను మలక్‌పేట పోలీసులు విచారించారు. మెహిదీపట్నంకు చెందిన నరేశ్ ఈ వసతి గృహంలో బాత్రూంలు, మరుగుదొడ్లు శుభ్రపరుస్తుంటాడు. అతడే బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్టు విచారణలో తేలినట్టు సమాచారం. అందులో ఓ బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.