ములుగు, జనవరి 30 (నమస్తే తెలంగాణ): మహాజాతరకు శుక్రవారం లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో మేడారం జనసంద్రమైంది. అయితే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా రద్దీకనుగుణంగా సౌకర్యాల్లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గద్దెలకు రెండు వైపులా ఉన్న క్యూలైన్లలో కనీస వసతులు లేని కారణంగా క్యూలైన్లలోనే కుప్పకూలిపోయారు. దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలకోర్చి తల్లుల దర్శనానికి వచ్చిన వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. వృద్ధులు, చిన్న పిల్లలు, అనారోగ్యంతో బాధపడే వారు అవస్థలు పడ్డారు. తల్లుల దర్శనం కోసం కలెక్టర్ మంజూరు చేసిన వీఐపీ, వీవీఐపీ పాస్‌లు పొందిన భక్తులకు క్యూలైన్లను ఎత్తేయడంతో శుక్రవారం జాతరకు వచ్చిన భక్తులు పాస్‌లు చేత పట్టుకొని క్యూలైన్లు, దర్శనాల కౌంటర్ల కోసం మేడారం వీధుల్లో వెతుకుతూ కనిపించారు. మరికొందరు దర్శనాలు చేసుకోకుండానే మెయిన్ గేటు బయట నుంచే మొక్కులు చెల్లించుకొని తిరుగు పయనమయ్యారు. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెకు చేరిన తర్వాత భక్తుల రాక ఒక్కసారిగా పెరగడంతో పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు.
అదుపు తప్పిన పరిస్థితులు
భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. ఎటు చూసినా దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి. మంగళవారం రాత్రి వరకు నామమాత్రంగా ఉన్న భక్తుల సంఖ్య.. బుధవారం నుంచి అనూహ్యంగా పెరిగింది. 2020 మహాజాతరలో 6 వేల మరుగుదొడ్లను నిర్మించగా, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రస్తుతం 5,600 నిర్మించారు. బ్యాటరీ ఆఫ్ ట్యాప్‌లను గత జాతరల కంటే తక్కువ సంఖ్యలో ఏర్పాటు చేశారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. శనివారం తల్లుల వన ప్రదేశంతో జాతర పరిసమాప్తం కానున్నది.