హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం రాత్రికి తుపానుగా బలపడుతుందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ శనివారం తెలిపారు. తుపాను ఉత్తరం వైపుగా కదులుతూ ఉదయానికి తీవ్రతుఫానుగా మారి అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో సాగర్ ద్వీపం-ఖేపుపరా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నదని వివరించారు. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అప్రమత్తం చేశారు. దక్షిణ కేరళ పరిసరాల్లో సముద్రమట్టానికి సగటున 5.8కిమీ వరకు ఆవర్తనం విస్తరించి ఉన్నదని, మరో ఆవర్తనం ఈశాన్య మధ్యప్రదేశ్ సమీపంలో విస్తరించిందని తెలిపారు. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ , విదర్భ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు.