Cyber crime bureau | సైబర్ నేరాలకు ముకుతాడు వేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. సైబర్ నేరాలకు పాల్పడేవారిని అరెస్టు చేసేందుకు, వారి నుంచి డబ్బులు వసూలు చేసి, బాధితులకు అప్పగించేందుకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేకంగా ‘సైబర్ క్రైమ్స్ బ్యూరో’ను ఏర్పాటు చేయనున్నది. ఈ క్రమంలో తెలంగాణ సైబర్ క్రైమ్స్ కోఆర్డినేషన్ సెంటర్(టీ4సీ)ని ప్రత్యేక బ్యూరోగా తీర్చిదిద్దేందుకు సర్వం సిద్ధం చేసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాల నివారణకు రాష్ట్రప్రభుత్వం, పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో.. సైబర్ నేరగాళ్లు కొత్తదారులు వెతుక్కొంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను ఆసరాగా చేసుకొని రోజుకొక వ్యూహంతో అమాయకుల నుంచి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. లాక్డౌన్ నుంచి తెలంగాణవ్యాప్తంగా సైబర్ నేరాల నమోదు సంఖ్య అధికంగానే ఉండటంతో.. కొత్త తరహా సైబర్ నేరాలను అడ్డుకొనేందుకు తెలంగాణ పోలీసులు ‘సైబర్ క్రైమ్స్ బ్యూరో’కు రూపకల్పన చేశారు. ప్రస్తుతం సైబర్ నేరాలను అధ్యయనం చేస్తూ, ఫిర్యాదులు అందిన వెంటనే డబ్బులు ఫ్రీజ్ చేస్తూ, ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న టీ4సీని మరింత పటిష్ఠం చేసి ‘సైబర్ క్రైమ్స్ బ్యూరో’గా ప్రకటించనున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నది.
సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు సైబర్ క్రైమ్ బ్యూరోలో నిష్ణాతులైన సిబ్బందిని నియమించుకోవాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ ప్రత్యేక బ్యూరోలో సుమారు 200 మందిని నియమించుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ బ్యూరో వస్తే నేరాలకు పాల్పడేది ఎవరైనా? వారు ఎక్కడున్నా? అరెస్టు చేసేందుకు వెనుకాడరు. దీనికితోడు సైబర్ నేరస్థులకు చేరకుండా హోల్డ్ చేసిన నగదును బాధితులకు ఇప్పించేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే హోల్డ్ చేసిన నగదును కోర్టుల ద్వారా బాధితులకు ఇప్పించేందుకు ఉన్న అడ్డంకులను సైతం తగ్గించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్స్‌ను దీటుగా ఎదుర్కొంటున్న రాష్ర్టాల్లో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక రాష్ర్టాలు ముందంజలో ఉన్నాయి. ఈ ప్రత్యేక బ్యూరో ఏర్పాటుతో సైబర్ క్రైమ్స్ అదుపులో తెలంగాణ దూసుకుపోనున్నది.