హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ)/హత్నూర: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఆయిల్ బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పరిశ్రమ డైరెక్టర్ రవితోపాటు కార్మికులు నలుగురు దుర్మరణం చెందారు. సుమారు 30 మందికి గాయాలయ్యాయి.
ఘటన సమయంలో పరిశ్రమలో దాదాపు 60 మంది ఉండగా, దాదాపు 15 మంది కార్మికులు బాయిలర్ వద్దే పనిచేస్తున్నట్టు తెలిసింది. ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమ లో బాయిలర్ పేలిన శబ్దం పది కిలోమీటర్ల మేర వినిపించింది. దట్టమైన పొగలు, మం టలు వ్యాపించాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని పలు పరిశ్రమల్లో కూడా ఆస్తినష్టం సంభవించింది.
ప్రమాద సమయంలో విధులకు హాజరైన కార్మికులు ఎంతమంది ప్రమా దం బారిన పడ్డారో వివరాలు తెలియాల్సి ఉన్నది. ప్రమాదం విషయం తెలియగానే పరిసర గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు ధాటికి పరిశ్రమ భవనం పెద్దమొత్తంలో ధ్వంసమైంది. రేకులషెడ్లు, ఇనుపరాడ్లు ఎగిరిపడ్డాయి. పరిశ్రమ మొత్తాన్ని దట్టమైన మంటలు, పొగ కమ్మేయడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి తీవ్రంగా శ్రమించారు.
బాధితులకు ఎంఎన్ఆర్ ప్రైవేటు దవాఖానతోపాటు సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఘటనాస్థలాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖమంత్రి రాజనరసింహ, పర్యావరణ మంత్రి సురేఖ, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సందర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. సంగారెడ్డి ఎస్పీ చెన్నూరిరూపేశ్ సంఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు.
పరిశ్రమలో పేలుడుపై సీఎం సమీక్ష
ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఘటనపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డిని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సహా యం అందజేయాలని సూచించారు.
ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి
పరిశ్రమలో ప్రమాదం జరిగి పలువురు కార్మికులు మరణించడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పేలుడులో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.