సుబేదారి/పరిగి, అక్టోబర్ 17 : అటవీ, మత్స్యశాఖలోని పలువురు అవినీతి అధికారులు శుక్రవారం ఏసీబీకి చిక్కారు. వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. మత్స్య శాఖ వరంగల్ జిల్లా అధికారి, హనుమకొండ జిల్లా ఇన్చార్జి అల్లు నాగమణి, వరంగల్ జిల్లా ఫీల్డ్ ఆఫీసర్ పెద్దబోయిన హరీశ్ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట మత్స్య సహకార సొసైటీలోని 184మంది కొత్త సభ్యులకు మత్స్యశాఖ నుంచి సభ్యత్వం ఇచ్చేందుకు సొసైటీ అధ్యక్షుడిని రూ.80వేలు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో నాగమణి, హరీశ్ సొసైటీ అధ్యక్షుడి నుంచి రూ.70వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. అలాగే వికారాబాద్ జరిగి పరిగిలో సీతాఫలాలను వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు పర్మిట్ కోసం రూ.40వేలు లంచం తీసుకుంటూ అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్లు సాయికుమార్, మహ్మద్ మొయినొద్దీన్ ఏసీబీకి చిక్కారు. శుక్రవారం పరిగిలోని అటవీ శాఖ కార్యాలయం వద్ద సెక్షన్ ఆఫీసర్ మొయినుద్దీన్ అటవీ శాఖలో పనిచేసే డ్రైవర్ బాలకృష్ణ సహకారంతో రూ.40వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని శిక్షణకు వెళ్లిన సాయికుమార్‌ను మరో బృందం అదుపులోకి తీసుకున్నట్టు రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు.
హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ఫెమా నిబంధనలను ఉల్లంఘించి.. అక్రమంగా విదేశీ మారక ద్రవ్యం లావాదేవీలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ పలు విదేశీ కరెన్సీని బదిలీచేసే ఫుల్ఫ్లెడ్జ్ మనీ చేంజర్స్, ఇతర సంస్థలపై సోదాలు చేసింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో క్లాసిక్ మనీ ట్రాన్స్ఫర్ అండ్ టూర్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్యూ-మనీ ఫ్లో ట్రావెల్స్ వాటి అనుబంధ సంస్థల్లో సోదాలు జరిగాయి. ఎఫ్ఎఫ్ఎంసీలు, ఇతర ఏజెంట్లు అక్రమ పద్ధతుల ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ నగదు మారకానికి పాల్పడుతున్నట్టు ఈడీ గుర్తించింది. ఈ లావాదేవీలు దేశీయంగా హవాలా మార్గం ద్వారా జరిగాయని, అది ఫెమా నిబంధనలు ఉల్లంఘించటమేనని ఈడీ శుక్రవారం ఒక ప్రకటనలో పేరొంది. పలు కీలక పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకొని రూ.2.75 కోట్ల విలువైన నగదు, బంగారం, ఎఫ్డీలు సహా ఎఫ్ఎఫ్ఎంసీలు, వాటి డైరెక్టర్ల బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపచేసినట్టు అధికారులు తెలిపారు.