హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ లో శనివారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే పలు బిల్లులను ప్రవేశపెట్టారు. మొదట పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క పంచాయతీరాజ్ సవరణ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లు-1ను ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార్క తెలంగాణ పబ్లిక్ సర్వీసుల నియామకం, సిబ్బంది తీరు, వేతన సవరణ, హేతుబద్ధ సవరణ-1, 2 బిల్లులను ప్రవేశపెట్టారు. అందెశ్రీ కుమారుడి ఉద్యోగ నియామకానికి సంబంధించి ఈ బిల్లును ప్రతిపాదించారు. పంచాయతీరాజ్ బిల్లులో రాష్ట్రంలోని పలు పంచాయతీల పేర్ల మార్పును ప్రతిపాదించగా సభ ఆమోదం తెలిపింది. మంత్రులు ప్రవేశపెట్టిన బిల్లులపై నామమాత్రంగా చర్చించి ఆమోదించడం గమనార్హం.