హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన సమయంలో అధికారుల కేటాయింపుపై గతంలో జారీ అయిన ఉత్తర్వులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈనెల 9న జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకొనేందుకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) నిరాకరించింది. ఏపీ, తెలంగాణకు చెందిన ఏడుగురు ఐఏఎస్ అధికారులకు మంగళవారం క్యాట్‌లో చుకెదురైంది. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన స్థానాల్లో ఈ నెల 16లోగా విధుల్లో చేరాలని మంగళవారం తేల్చి చెప్పింది. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలన్న ఐఏఎస్ అధికారుల అభ్యర్థనను తోసిపుచ్చింది. విచారణను నవంబర్ ఐదుకు వాయిదా వేసింది. అప్పటిలోగా కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ నివేదికను అందజేయాలని ఆదేశించింది.
పిటిషనర్ల నివాసం, పరస్పర బదిలీలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ వంటి అంశాల వారీగా కౌంటరు దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది. ప్రజాహితాన్ని పరిగణనలోకి తీసుకొని కేటాయించిన రాష్ట్రాల్లో పనిచేయాలని హితవు పలికింది. ఆయా అధికారుల సేవల అవసరాలను పరిశీలించిన తరువాతే తాము ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విధుల్లో చేరినప్పటికీ ఆ చేరిక తాము వెలువరించే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 9న జారీచేసిన ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, కే ఆమ్రపాలి, ఏ వాణీ ప్రసాద్, డీ రొనాల్డ్‌రాస్, జీ సృజన, హరికిరణ్, శివశంకర్ క్యాట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై క్యాట్ సభ్యులు లతా బస్వరాజ్ పట్నే, శాలినీ మిశ్రాతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా జరిగాయి. ఆ తర్వాత కేంద్రం జారీచేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని క్యాట్ తేల్చి చెప్పింది. ‘రాష్ట్ర విభజన నేపథ్యంలో అఖిత భారత సర్వీసు ఉద్యోగుల విభజనకు రూపొందించిన మార్గదర్శకాలు కొంతమంది అధికారులకు ఇబ్బంది కావచ్చు. అంతమాత్రాన అధికారుల సర్దుబాటు తప్పదు. ప్రజాప్రయోజనాలు, అధికారుల సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం వాళ్లను ఆయా రాష్ట్రాలకు కేటాయించింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఆసారం లేదు. కాబట్టి ఏవిధమైన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం లేదు’ అని క్యాట్ ఆదేశాల్లో పేరొంది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో పలువురు ఐఏఎస్ అధికారులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. క్యాట్ ఉత్తర్వులపై బుధవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు కొందరు అధికారులు వెల్లడించారు.
క్యాట్‌కు వెళ్లి తప్పు చేశామా?: పలువురు అధికారుల అంతర్మథనం
డీవోపీటీ ఆదేశాలపై క్యాట్‌ను ఆశ్రయించి తప్పు చేశామా? అని పలువురు అధికారులు భావిస్తున్నట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వాస్తవానికి డీవోపీటీ ఆదేశాల తర్వాత రాజకీయ ప్రక్రియ ద్వారా తమ బదిలీని వాయిదా వేయించాలని అధికారులు భావించారట. కానీ రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ ముఖ్య నేత కొందరు ఐఏఎస్ అధికారులను పిలిచి క్యాట్‌ను ఆశ్రయించాలని సూచించినట్టు సమాచారం. హైకోర్టు ఆదేశాల మేరకే డీవోపీటీ ఈ నిర్ణయం తీసుకున్నది కాబట్టి క్యాట్‌ను ఆశ్రయించినా ఫలితం ఉండకపోవచ్చని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారట. కానీ ఆ నేత మాత్రం ‘రాజకీయంగా ప్రభుత్వ సాయం అందించే పరిస్థితి లేదు. కాబట్టి క్యాట్‌ను ఆశ్రయించండి’ అంటూ ఒత్తిడి చేసినట్టు చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు వ్యతిరేకంగా ఆదేశాలు రావడంతో అంతర్మథనం చెందుతున్నారట. అనవసరంగా ఆ నేత మాటలు విన్నామని.. క్యాట్‌ను ఆశ్రయించడం ద్వారా డీవోపీటీకి వ్యతిరేకంగా వెళ్తున్నామనే భావన కల్పించినట్టు అయ్యిందని, అవనసరంగా చర్చల్లో నిలిచామని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈ పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించినా అనుకూల ఫలితం వచ్చే అవకాశాలు తక్కువేనని చెప్పుకుంటున్నారట. అటు పరువు పోవడంతోపాటు ఇటు ఏపీకి వెళ్లక తప్పడం లేదని వాపోతున్నారని సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
త్వరలో ఐపీఎస్‌ల బదిలీలు?
తెలంగాణలో మరోసారి ఐపీఎస్‌ల బదిలీలు జరుగనున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌తోపాటు, రాష్ట్రంలోని మరికొందరు ఐపీఎస్‌లకు స్థానచలనం తప్పదని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా అవినీతి పనుల్లో తలదూర్చుతున్న ఐపీఎస్‌లను పూర్తిగా నాన్‌ఫోకల్ పోస్టుల్లో వేస్తారనే చర్చ జోరందుకున్నది. తాజాగా జరగబోయే బదిలీల్లో డజను మంది సీనియర్ నుంచి జూనియర్‌స్థాయి ఐపీఎస్‌లు ఉంటారని తెలిసింది.