ఉప్పల్ , ఫిబ్రవరి 11: మహా కుంభమేళా యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. పుణ్యస్నానం చేసుకొని తిరిగి వస్తున్న భక్తులను ట్రక్కు రూపం లో మృత్యువు కబళించింది. మధ్యప్రదేశ్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు తెలంగాణ వాసులు మరణించారు. వీరంతా హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన వారు. కొందరు బంధువులు, స్నేహితులు కలిసి మినీ బస్సులో ప్రయాగ్‌రాజ్ వెళ్లారు. పుణ్యస్నానం తర్వాత తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో వీరి బస్సు ప్రమాదానికి గురైంది. మంగళవారం ఉదయం 8.30 గంటలకు సిహోరా పట్టణానికి సమీపంలో సిమెంట్ లోడ్‌తో ఉన్న ఓ ట్రక్కు రాంగ్ రూట్లో వచ్చి మినీ బస్సును ఢీకొట్టింది. ఘటన సమయంలో రెండు వాహనాలు వేగంగా ఉండటంతో మినీ బస్సు నుజ్జునుజ్జయ్యింది. ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. బస్సులో ఇరుక్కుపోయిన మరో ఆరుగురిని స్థానికులు బయటకు తీసి జబల్పూర్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మినీ బస్సు వెనుక ఓ కారు కూడా ప్రమాదానికి గురైనప్పటికీ అందులో ఉన్న వారు సురక్షితంగా బయటపడినట్టు ఏఎస్పీ సూర్యకాంత్ శర్మ తెలిపారు.
నాచారంలో విషాదఛాయలు
ఈ ఘటన మృతులంతా నాచారంలోని రాఘవేంద్రనగర్, కార్తికేయ నగర్‌కు చెందినవారు. మంగళవారం తెల్లవారుజామునే బయలుదేరుతామని కుటుంబసభ్యులకు చెప్పారు. ఉదయాన్నే ప్రమాదవార్త తెలియడంతో రోదనలు మిన్నంటాయి. మృతుల్లో నవీన్, బాలకృష్ణ, సంతోష్, శశికాంత్, రవి, ఆనంద్ ఉన్నట్టు గుర్తించారు. మృతదేహాల తరలింపునకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్టు మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌యాదవ్ తెలిపారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.