హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తిరుమలలో శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను ట్రావెల్ ఏజెంట్లకు అక్రమంగా విక్రయించిన దళారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. టికెట్లను దళారులు రూ.35 వేలకు భక్తులకు విక్రయించిన వ్యవహారంలో టీటీడీ ఉద్యోగితోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదైంది. దళారులు ఈ నెల 23న దర్శన టికెట్లను ట్రావెల్ ఏజెంట్లకు విక్రయించినట్టు పోలీసులు తెలిపారు. టోకెన్ల తనిఖీ సమయంలో అనుమానం రావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ జరుపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
దేశంలో అగ్రశ్రేణి ఆన్లైన్ రిటైల్ కంపెనీలైన ఫ్లిప్‌కార్ట్, మింత్రా సీఈవోలు కల్యాణ్ కృష్ణమూర్తి, అమర్ నాగారం గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు ఏపీఐఐసీ డైరెక్టర్ రజనీకాంత్‌రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తితో సీఈవోలు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. త్వరలో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రెండు కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్టు ఏపీఐఐసీ డైరెక్టర్ తెలిపారు.