జమ్మికుంట, సెప్టెంబర్ 22: గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్న తెలంగాణలోని ఏడు ప్రభుత్వ దవాఖానలకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. వీటిలో ఖమ్మం జిల్లా ధంసులాపురం, అదిలాబాద్ జిల్లా ధనోరా, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, సూర్యాపేట జిల్లా రామారం, భూపాలపల్లి జిల్లా జంగేడు, నల్లగొండ జిల్లా ముషంపల్లి, జగిత్యాల జిల్లా ధరూర్ హెల్త్ వెల్నెస్ సెంటర్లు ఉన్నాయి. వైద్యసేవల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న ధంసులాపురం దవాఖాన 97%, జమ్మికుంట 90% మార్కులు స్కోరుతో అగ్రభాగంలో నిలిచాయి. అందుకు సంబంధించిన పత్రాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ నెల 11న విడుదల చేసింది.
జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఆయా దవాఖానల అభివృద్ధి, విస్తరణల కోసం మూడేండ్లపాటు నిధులు రానున్నాయి. గత నెలలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య, ఆరోగ్య సంరక్షణ, పల్లె, బస్తీ దవాఖాన ను జాతీయ వైద్యబృందం సందర్శించింది. ప్రజలకు అందుతున్న సేవలు, పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలు, మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణ, ఆరోగ్య కార్యక్రమాలు అమలు, పరిసరాల పరిశుభ్రత, తదితర అంశాలపై ఆరా తీసింది. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించింది. ఈ బృందం అందజేసిన నివేదికల ఆధారంగా జాతీయ వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తమ దవాఖానలను ఎంపిక చేసింది.