హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో మంగళవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ వ్యవహారంలో మొత్తం ఐదు కేసులు నమోదుచేసినట్టు రాచకొండ పోలీసులు తెలిపారు. అక్రమంగా లేగదూడలను రవాణా చేస్తున్న ఏడుగురిని అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. పశువుల వ్యాపారులు మంగళవారం నల్లగొండ జిల్లా నుంచి హైదరాబాద్‌కు లేగ దూడలను తరలిస్తుండగా గోరక్షక్ సేవకుల పేరుతో కొందరు అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గోరక్షక్ సేవకులు కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్‌లోకి వెళ్లడంతో, వారిని పశువులను తరలిస్తున్నవారు వెంబడించారు. దీంతో ఈ వ్యవహారం మతం రంగు పులుముకొని ఉద్రిక్తతకు దారితీసింది. తమ మనోభావాలను దెబ్బతీశారంటూ ఒకవర్గం నిరసనలకు దిగింది. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గోరక్షక్ సేవకులతో పాటు మరికొందరు పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ గొడవలపై మొత్తం ఐదు కేసులను నమోదు చేసిన రాచకొండ పోలీసులు, అక్రమంగా లేగదూడలను తరలిస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు. పరిస్థితిని అదుపులో పెట్టేందుకు కర్మన్‌ఘాట్ ప్రాంతంలో పోలీసు పికెటింగ్‌ను ఏర్పాటుచేశారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై పోలీసులు నజర్ పెట్టారు. పోలీసు కమిషనర్ మహేశ్‌భగవత్ సంఘటన స్థలాన్ని బుధవారం ఉదయం పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు.