ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్లబంజర గ్రామానికి చెందిన అశోక్ కన్న, పద్మశ్రీ 2006లో ప్రేమ పెండ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు ఉంది. అనారోగ్యంతో పద్మశ్రీ గత నెల 28న మృతిచెందింది. నెల మాసికం సందర్భంగా గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో భార్య విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. సోమవారం బంధువుల సమక్షంలో పూలమాలలు వేసి నివాళులర్పించిన అశోక్.. పద్మశ్రీపై ప్రేమను చాటుకున్నాడు.
దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా హకీంపేట చౌరస్తాలో రైతులు చేపట్టిన రిలే దీక్షలు సోమవారం 12వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. హకీంపేట, పోలేపల్లి, లగచెర్ల, పులిచెర్లకుంటతండా, రోటిబండ తండాల పరిధిలో 1300 ఎకరాల ప్రభుత్వ, పట్టా భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఫార్మా కంపెనీ కోసం భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.