ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 26: ఈ ఏడాది టీఎస్ సెట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు సెట్ సభ్యకార్యదర్శి మురళీకృష్ణ తెలిపారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని వివరించారు. మొత్తం 29 సబ్జెక్టులకు 40,838 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారని తెలిపారు.
ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. హాల్టికెట్లను ఇప్పటికే తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని చెప్పారు. అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోవాలని, లేనిపక్షంలో పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు సెట్ ఉత్తీర్ణత కావాలి.