TS Assembly Session | హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనమండలి, శాసనసభ సమావేశాలు ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు సభానాయకుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శాసనసభ సమావేశాల నిర్వహణ తేదీని శుక్రవారం ఖరారు చేశారు. శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఉభయసభల సమావేశాలకు సంబంధించి అధికారికంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖ రాశారు. ఆగస్టు 3న ఉదయం 11.30 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాల మృతికి సభ సంతాప తీర్మానం చేయనున్నది. ఇటీవల మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా సంతాపం తెలుపనున్నది. అనంతరం శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించనున్నది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే పద్దులు చర్చకు రానున్నాయి? వంటి కీలక అంశాలపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభకు ఇవి తుది సమావేశాలు అవుతాయని భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారాన్ని స్వీకరించిన తరువాత 2018 జనవరి 16న సభ తొలి సమావేశం జరిగింది. ఈ సభకు ఐదేండ్ల కాలపరిమితి 2024 జనవరి 16తో ముగియనున్నది. ఈలోగానే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ చేసి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. ఈ సమావేశాల్లో పలు కీలకమైన బిల్లులను ఆమోదించే అవకాశం ఉన్నది. గవర్నర్ వద్ద సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు బిల్లులపై మళ్లీ ఈ సభలో కూడా చర్చించనున్నట్టు తెలిసింది. ఆయా బిల్లులపై 31న మంత్రివర్గ సమావేశంలో చర్చించి తిరిగి శాసనసభలో ప్రవేవపెట్టనున్నట్టు సమాచారం. సభ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌కు పంపనున్నారు. శాసనసభ ద్వారా రెండోసారి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించకతప్పదు. గతంలో గవర్నర్ పలు బిల్లులను ఉద్దేశపూర్వకంగా ఆమోదించకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో గవర్నర్ పెండింగ్‌లో పెట్టిన బిల్లులపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. వీటిని తిరిగి శాసనసభలో ప్రవేశపెట్టి, చర్చించి గవర్నర్‌కు పంపే అంశంపై లోతుగా చర్చిస్తున్నది.
అసెంబ్లీ సిబ్బందికి సెలవులు రద్దు
శాసనసభ సమావేశాలు ఆగస్టు 3 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో శాసనసభ ఉద్యోగులకు శని, ఆదివారాల్లో సెలవులను రద్దు చేశారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.