హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ‘సారథి పరివాహన్’ పోర్టల్ సేవలు సోమవారం దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఎక్కువమంది సారథి పోర్టల్‌ను ఉపయోగిస్తే.. ట్రాఫిక్ విపరీతంగా పెరిగి సర్వర్లు డౌన్ అవుతున్నాయని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. ఒక్కోసారి సాఫ్ట్వేర్ అప్డేట్లు, డాటా మైగ్రేషన్, నెట్వర్ నిర్వహణ పనులు జరుగుతున్నప్పుడు కలుగుతున్న అంతరాయంతో వాహనదారులు చిర్రెత్తిపోతున్నారు. సోమవారం కూడా సాంకేతికత సమస్యలు సారథిని చుట్టుముట్టడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సారథి డిజిటల్ పోర్టల్ పని చేయకపోవడంతో తెలంగాణలోని ఆర్టీఏ కార్యాలయాల్లో కూడా పనులన్నీ పూర్తిగా స్తంభించాయి.
లెర్నర్ లైసెన్స్, పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కోసం ముందుగానే స్లాట్ బుక్ చేసుకొని, ఉదయాన్నే ఆఫీసులకు వచ్చే వాహనదారులు సర్వర్ రాక క్యూలో గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. డ్రైవింగ్ ట్రాక్ టెస్టులకు హాజరైన చాలామందికి బయోమెట్రిక్ నమోదు కాకపోవడం, ఆన్లైన్లో అప్డేట్ కాకపోవడంతో టెస్టులు వాయిదా పడ్డాయి. కాగా, తెలంగాణలో సాంకేతిక సమస్యను పూర్తిగా పరిష్కరించామని, మంగళవారం నుంచి యథావిధిగా సేవలు కొనసాగుతాయని ఆర్టీఏ ఉన్నతాధికారులు చెప్పారు.