నీలగిరి, నవంబర్ 23 : కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ వర్గానికే పదవులు వస్తున్నాయని, నిఖార్సైన కార్యకర్తలకు స్థానంలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధాన అనుచరుడు గుమ్ముల మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ డీసీసీ అధ్యక్ష పదవి దకకపోవడంతో ఏకంగా మంత్రి క్యాంపు కార్యాలయంలోనే ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. తన తండ్రి ఎంపీనో, ఎమ్మెల్యేనో అయ్యుంటే తనకు పదవి దక్కేదని ఆవేదన వ్యక్తంచేశారు. తన కులమే పార్టీ పదవికి అడ్డుగా నిలిచిందని వాపోయారు. కొత్త అధ్యక్షుడిగా నియమితులైన కైలాస్ నేతకు శుభాకాంక్షలు తెలుపుతూనే ఆయన పార్టీ హైకమాండ్‌కు చురకలంటించారు.
సీఎం, డిప్యూటీ సీఎంల పేర్లను ప్రస్తావిస్తూ జంపింగ్ లీడర్లను ప్రోత్సహిస్తే సహించబోమని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ తనకు 24గంటల్లో ఆర్టీసీ చైర్మన్ పదవి ఇప్పించాలని డిమాండ్ చేశారు. తన భుజం మీద చేయివేసి సీఎం రేవంత్‌రెడ్డి గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ తన సన్నిహితులు పటేల్ రమేశ్‌రెడ్డికి కార్పొరేషన్ పదవి, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, రఘువీర్రెడ్డిలకు ఎంపీలను చేశారని ప్రస్తావించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ కోసం నిబద్ధతతో పని చేశానని స్పష్టం చేశారు. పార్టీ లైన్ దాటకుండా పని చేయడం తనకు మంత్రి కోమటిరెడ్డి నేర్పారని, అది కొనసాగిస్తానని స్పష్టంచేశారు.