హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): సీనియర్ జర్నలిస్టు జాగర్లమూడి రామకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం అనారోగ్యంతో కన్నుమూశారు. బంధువులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం రామకృష్ణ పార్థివ దేహాన్ని హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలోని సారథి స్టూడియో వెనకనున్న అశ్విన్ అపార్ట్మెంట్లో ఉంచనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జాగర్లమూడి మృతికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా పలు మీడియా సంస్థల్లో పనిచేసి, పాత్రికేయుడిగా పత్రికా రంగానికి ఆయన అందించిన సేవలు మరవలేనివని కొనియాడారు. రామకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.