Telangana DGP : తెలంగాణ రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ (బుధవారం) ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. మంగళవారమే ఉత్తర్వులు రావాల్సి ఉన్నా సీఎం మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఉత్తర్వులు వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీగా జితేందర్ గుర్తింపు పొందనున్నారు.
ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జితేందర్ పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో రైతు కుటుంబంలో జన్మించారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఏపీ క్యాడర్‌కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. నాడు నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. తర్వాత ఢిల్లీ సీబీఐలో 2004 నుంచి 2006 వరకు గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వహించారు.
ఆ తర్వాత డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్లో బాధ్యతలు నిర్వర్తించారు. అప్పాలో కొంతకాలం పనిచేశారు. అనంతరం వరంగల్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత హైదరాబాద్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. ఆ తర్వాత శాంతిభద్రత విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా బాధ్యతలు నిర్వర్తించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఆయన పదవీకాలం ముగియనుంది. ఇప్పుడు డీజీపీగా నియమితులైతే 14 నెలలపాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం డీజీపీ రవిగుప్తాను ప్రభుత్వం నియమించలేదు. శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం అప్పటి డీజీపీ అంజనికుమార్ను క్రమశిక్షణ చర్య కింద సస్పెండ్ చేసిన ఎన్నికల కమిషన్.. రవిగుప్తాను డీజీపీగా నియమించింది.
అయితే, ఇటీవల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడం, ఎక్కడ చూసినా చైన్‌స్నాచింగ్ ముఠాలు, దోపిడీ గ్యాంగులు హల్చల్ చేస్తుండటం, నడిరోడ్లపైనే హత్యలు జరుగుతుండటంతో డీజీపీ మార్పు అనివార్యమైంది. 1994 బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ సీపీగా ఉండగా, సౌమ్యమిశ్రా జైళ్లశాఖ డీజీగా, శివధర్‌రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీగా, శిఖాగోయెల్ ఉమెన్ సేఫ్టీ వింగ్ సీఐడీగా, ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీగా, అభిలాష బిస్త్ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. వీరికి ఇంకా డీజీపీ హోదా రాకపోవడంతో సీనియర్ అయిన జితేందర్ వైపు ప్రభుత్వం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.