హైదరాబాద్, జూన్30 (నమస్తే తెలంగాణ): ‘విరమణ పొందిన ఉద్యోగులను ఎట్టిపరిస్థితుల్లో కొనసాగించబోము’ అని సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇతర పెద్దలు పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ, అందుకు విరుద్ధంగా నీటిపారుదల శాఖలో ఎందరికో ఉద్యోగ కాలాన్ని పొడిగిస్తూ ఆ హామీని తుంగలో తొక్కారు. ఇప్పటికే విరమణ పొందిన పలువురు ఇంజినీర్ల సర్వీస్‌ను పొడిగించిన ప్రభు త్వం.. తాజాగా ఇదే శాఖలో మరో ఇంజినీర్‌కు ఎక్స్టెన్షన్ కల్పించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈఎన్సీ (అడ్మిన్) టీ శ్రీనివాస్ మంగళవారం ఉద్యోగ విరమణ పొందారు. ఆయన సర్వీస్‌ను మరో 6నెలల పాటు పొడిగించినట్టు తెలిసింది.
గతంలో ఈఎ న్సీ జనరల్ రమేశ్‌బాబుకు ఆరు నెలలపాటు పొడిగించింది. నాగర్‌కర్నూల్ సీఈ విజయభాస్కర్‌రెడ్డి, హైదరాబాద్ సీఈ సత్యనారాయణరెడ్డికి సైతం ఎక్స్టెన్షన్ అవకాశం కల్పించింది. సర్కార్ తీరుపై ఇంజినీర్ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇరిగేషన్ శాఖలో తాజాగా మరో 23 మంది అధికారులకు ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించింది.
మంగళవారం జరిగిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశంలో ఈ నిర్ణ యం తీసుకొన్నట్టు తెలిసింది. అందులో సీనియారిటీ ఆధారంగా 8 మంది సూపరింటెండెంట్ ఇంజినీర్ల (ఎస్ఈ)కు చీఫ్ ఇంజినీర్లు(సీఈ)గా, 15మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల (ఈఈ)కు ఎస్ఈలుగా ప్రమోషన్లు కల్పించినట్టు సమాచారం. వారి ప్రమోషన్లకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సాగునీటి పథకాల పరిధిలోని ప్రాజెక్టులపై జూలై 8న ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రగతి మీటింగ్ నిర్వహించనున్నారు. అందులో ప్రధానంగా పీఎంకేఎస్‌వై (ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన) కింద రాష్ర్టాల్లో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించనున్నారు. ఈ సమావేశ ఎజెండాలో తెలంగాణకు సంబంధించి దేవాదుల, రాజీవ్ భీమా లిఫ్ట్ స్కీమ్‌లను చేర్చారు. పీఎంకేఎస్వైలో భాగంగా అమలు చేస్తున్న మోడ్రనైజేషన్ ఆఫ్ కమా ండ్, ఏరియా డెవలప్మెంట్ (ఎంక్యాడ్) సబ్‌స్కీమ్ అంశాలపై 2వ తేదీన సమావేశాన్ని నిర్వహించనున్నారు. అందులో జకోరా చందూరు లిఫ్ట్ ఆయకట్టు అభివృద్ధిపై చర్చించనున్నట్టు సమాచారం.