Congress | హైదరాబాద్, మార్చి11(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ‘పెద్ద’గా పేరువడిన ఒకరిని రాష్ట్ర ప్రభుత్వంలోకి కీలకపాత్రలో ప్రవేశపెట్టేందుకు పావులు కదులుతున్నాయా? ఆ ‘పెద్ద’కు చీఫ్ అడ్వైజర్ పదవి కట్టబెట్టి, క్యాబినెట్ హోదాలో సెక్రటేరియట్లో కూర్చోబెట్టడానికి రంగం సిద్ధమైందా? ఈ మేరకు మూడు నాలుగు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయా? అంటే గాంధీభవన్ వర్గాలు అవుననే చెప్తున్నాయి. ఇటీవల జరిగిన ఆసక్తికర పరిణామాలు ఇందుకు దారితీస్తున్నాయని గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేయడం వలన దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరుగుతుందనే వాదన తెర మీదికి వచ్చిన నేపథ్యంలో త్వరలో దక్షిణాది రాష్ర్టాల నేతల సమన్వయంతో ఒక కార్యాచరణ రూపొందించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచే బాధ్యతను కాంగ్రెస్ పెద్దలు ఒకరికి అప్పగించాలని అధిష్ఠానమే సూచించిందనీ, దీంతో ఇటీవల రాష్ట్ర ముఖ్యనేత స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఇంటికి వెళ్లి దాదాపు అరగంట పాటు చర్చించారని తెలిసింది. ఈ సందర్భంగా ముఖ్యనేత ఈ ఏడాది కాలంలో తనకు ఎదురైన అనుభవాలను సదరు సీనియర్ నేత వద్ద ఏకరువు పెట్టినట్టు సమాచారం. నలుగురు మంత్రుల పేర్లను ప్రస్తావిస్తూ, వారి ప్రతి అడుగూ తనకు వ్యతిరేకంగానే ఉంటున్నదని, ఉన్నవీ లేనివి కల్పించి ఢిల్లీకి మోస్తున్నారని, అధిష్ఠానం దృష్టిలో తనను విలన్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని వాపోయినట్టు తెలిసింది.
కొంతమంది సీనియర్ బ్యూరోక్రాట్లు తాను తీసుకునే నిర్ణయాలను ఖాతరు చేయడం లేదని, వారిని పిలిచి ఏదైనా ‘ముఖ్యమైన ఫైల్’ అని చెప్తే, కిందికి వెళ్లి ‘నోట్‌ఫైల్’ అని రాస్తున్నారని, వీరిని అజ్ఞాతశక్తులేవో నడిపిస్తున్నాయనే అనుమానం వ్యక్తంచేసినట్టు తెలిసింది. సీనియర్ బ్యూరోక్రాట్లు ఢిల్లీ నుంచే పోస్టింగ్‌ల కోసం పైరవీలు చేస్తున్నారని, అధిష్ఠానం ఆదేశం మేరకు ఇక్కడ కీలక పోస్టింగ్‌లు ఇవ్వాల్సి వస్తున్నదని, వారే ఇక్కడ వ్యవహారాలు నడిపిస్తున్నట్టు సదరు సీనియర్ నేతకు వివరించినట్టు తెలిసింది. ఢిల్లీలో తనకు అండగా నిలబడి, అధిష్ఠానానికి తన గురించి మంచిగా చెప్పే సీనియర్ నేతలు ఎవరూ లేకపోవడం తన దురదృష్టమని అన్నట్టు తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ బాధ్యత తీసుకొని, తనకు సూచనలు, సలహాలు ఇస్తూ తనను గట్టెక్కించాలని ప్రాధేయపడినట్టు తెలిసింది.
చీఫ్ సలహాదారు పదవి ఇస్తే..
ముఖ్యనేత అభ్యర్థనపై స్పందించిన కాంగ్రెస్ పెద్ద తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉంటానని, మీరు కోరుతున్నందున సలహాలు, సూచనలు ఇవ్వగలనని చెప్పినట్టు తెలిసింది. ఏ అధికార హోదా లేకుండా సచివాలయంలో సమీక్షలు చేయడం, కేంద్రంతో సంప్రదింపులు జరపడం, పొరుగు రాష్ర్టాల నేతలను సమన్వయం చేయడం, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం సాధ్యంకాదు కాబట్టి, తనకు ముఖ్య సలహాదారు పదవి ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. వారంలో కనీసం రెండుసార్లు సచివాలయానికి వచ్చి అక్కడి పరిస్థితిని అంచనా వేసి చెప్పగలనని, అధికారిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పినట్టు సమాచారం. ఒకే ఇంట్లో మూడు పదవులు ఇవ్వడమా? అని ముఖ్యనేత కొంత సంశయించినప్పటికీ, ప్రస్తుతం పార్టీ, ప్రభుత్వం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అంగీకరించక తప్పలేదు. అదే విషయాన్ని ముఖ్యనేత అధిష్ఠానానికి వివరించి, చీఫ్ అడ్వైజర్ పదవి ఇవ్వాలని అభ్యర్థించినట్టు తెలిసింది.
ముఖ్యనేత ఏ ప్రతిపాదన చేసినా పెండింగ్‌లో పెట్టి నానుస్తూ వస్తున్న అధిష్ఠానం.. ‘సలహాదారు’ నియామకం ప్రతిపాదనకు మాత్రం అడిగిన వెంటనే ఆమోదం తెలపడంలో ఆంతర్యం ఏమిటనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నది. ఇది ముఖ్యనేత వినతిని ఆమోదించడమా? లేక అధిష్ఠానం ట్రాపులో ముఖ్యనేత పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పెద్దల సలహాలు, సూచనలు ప్రభుత్వానికి అవసరమని ముఖ్యనేత అధిష్ఠానానికి సూచించిన మరుక్షణమే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పడంపై కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ముఖ్యనేత కోరిక మేరకే అధిష్ఠానం ఇందుకు అంగీకరించినట్టు పైకి కనిపిస్తున్నప్పటికీ, రహస్య ఎజెండా మరొకటి ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. సచివాలయంలో పాలనాపరమైన విషయాలను శోధించి, మధించడంతోపాటు ముఖ్యనేత కదలికలను కూడా ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి నివేదిస్తారనే ప్రచారం జరుగుతున్నది. అధిష్ఠానం విసిరిన పాచికలో పావుగా మారి ముఖ్యనేత తనగోతి తనే తవ్వుకున్నారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.