ఆదిలాబాద్, అక్టోబరు 11(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌కు 25 ఏండ్లుగా విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనకు అవమానం జరగడంతో కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపెల్లి శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు శనివారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు లేఖ రాసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత వరకు ఐదేండ్లుగా పాదరక్షలు వేసుకోకుండా కఠిన దీక్ష చేపట్టినట్టు గుర్తుచేశారు.
రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవరకు దీక్షను కొనసాగించనున్నట్టు తెలిపారు. పార్టీపై అభిమానంతో తన కుమారుడికి రాజీవ్‌గాంధీ, కూతురుకు ఇందిరాప్రియదర్శిని పేర్లు పెట్టినట్టు పేర్కొన్నారు. 2001 నుంచి 2025 వరకు పార్టీకి విధేయుడిగా, 2008 నుంచి 2012 వరకు ఆదిలాబాద్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, 2013 నుంచి 2015 వరకు యువజన కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, 2015 నుంచి 2018 వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్‌గా, 2018 నుంచి 2020 వరకు జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా, 2020 నుంచి 2025 వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా (అప్రూవల్ లేదు), 2023-24 ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల మేనేజ్మెంట్ కోఆర్డినేటర్‌గా పార్టీకి సేవలు అందించినట్టు తెలిపారు.