నిజామాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజల మద్దతు వెల్లువెత్తుతున్నది. గులాబీ అధినేతకు స్వచ్ఛందంగా జైకొడుతున్న గ్రామాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. వివిధ గ్రామాల ప్రజలు కేసీఆర్‌కే ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానాలు చేయడమే కాకుండా ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం విరాళాలు సైతం అందజేస్తున్నారు. ఆసరా పెన్షన్ పొందుతున్న వృద్ధులు, డబుల్బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులైన నిరుపేదలు సైతం విరాళాలు అందజేసి సీఎం కేసీఆర్‌పై అభిమానం చాటుకుంటున్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలోని కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లోని అనేక గ్రామాల ప్రజలు సీఎంకు మద్దతుగా తీర్మానాలు చేయగా తాజాగా రామారెడ్డి మండలం జగదాంబతండా, బట్టుతండా, స్కూల్తండా, గొడుగు మర్రితండా గ్రామ పంచాయతీల ప్రజలు కేసీఆర్‌కు ఓటేస్తామని తీర్మానాలు చేశారు. గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహారాజ్ ఆలయంలో సోమవారం భోగ్‌బండార్ నిర్వహించి ఏకగ్రీవ తీర్మానాల ప్రతులను ఎంపీపీ దశరథ్రెడ్డికి అందజేశారు. అంతేకాకుండా అక్కడ ఏర్పాటుచేసిన విరాళాల డబ్బాలో అనేకమంది వృద్ధులు డబ్బులు జమ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. రామారెడ్డి మండలానికి చెందిన ఒక మహిళ తనకు డబుల్ బెడ్రూం ఇల్లు అందించినందుకు కృతజ్ఞతగా చందా అందజేశారు. మాచారెడ్డి మండలంలో తొమ్మిది గ్రామ పంచాయతీలు కేసీఆర్‌కు మద్దతుగా తీర్మానాలు చేశాయి. పాల్వంచ మండలం దేవునిపల్లి గ్రామస్థులంతా కేసీఆర్‌కే జైకొట్టారు.
కేసీఆర్ సార్కే మా మద్దతు
కేసీఆర్ సార్ కామారెడ్డికెళ్లి పోటీ జేత్తున్నందుకు మస్తు సంతోషమనిపిత్తున్నది. గాయిన మా అసుంటోళ్లకు మస్తు మంచి జేసిండు. పెద్దకొడుకోలే నెలనెలా పింఛిన్ పైసలు పంపుతుండు. గీ ఎన్నికలల్ల కేసీఆర్సారు ఖర్సుల కోసమని నాకు అచ్చేటి పింఛిన్ డబ్బులు విరాళంగా ఇచ్చిన. మా తండాను పంచాయితీ జేసిన దేముడు కేసీఆర్. గాయిన వెంట అందరం నడవాలె.
– గంగావత్ రంగి,గొడుగు మర్రి తండా, రామారెడ్డి
చాలా సంతోషంగా ఉంది
మా కామారెడ్డి నుంచి కేసీఆర్ సారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఆయన్ని గెలిపించుకుంటాం. మమ్ములను, మా బాధలను అర్థం చేసుకుని మాకోసం ఎంతో చేస్తున్న కేసీఆర్‌ను గెలిపించుకోవడం మా బాధ్యత.
– లలిత, స్కూల్తండా, రామారెడ్డి