Cartoonist Satyamurthy | తెలుగు యూనివర్సిటీ, మే 26 (నమస్తే తెలంగాణ): వ్యంగ్య చిత్ర కళాజగతిలో సత్యమూర్తిగా చిరపరిచితులైన భావరాజు వెంకట సత్యమూర్తి (84)గురువారం రాత్రి హైదరాబాద్‌లో తమ స్వగృహంలో కన్నుమూశారు. రావు సాహెబ్‌గా విశిష్ట గౌరవాలు అందుకున్న సత్యనారాయణరావు కుమారుడు సత్యమూర్తి. కార్టూన్ రంగంలో, కమర్షియల్ ఆర్ట్ రంగంలోనూ ఆయన విశేష ఖ్యాతిని గడించారు. సత్యసాయి డిజైనింగ్ స్టూడియోస్‌ను స్థాపించి, భగవాన్ సత్యసాయి బాబా చెప్పిన నీతి కథలకు ఆయన బొమ్మలు వేసేవారు. తెలుగు, ఆంగ్ల భాషలో అనేక కథల పుస్తకాల్లో ఆయన బొమ్మలు వచ్చాయి. ఫార్మారంగంలోనూ, దాని అనుబంధ ప్యాకేజింగ్ రంగాలలోనూ ఆయన రూపొందించిన డిజైన్లకు చాలా ప్రచారం ఉండేది. స్టేట్ బ్యాంకు వంటి పెద్ద సంస్థలకు కార్టూన్ క్యాలెండర్లు రూపొందించి ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.
ప్రముఖ పత్రికలు ఆయన కార్టూన్లను ప్రచురించాయి. చలన చిత్రరంగంలో పబ్లిసిటీ డిజైన్ శాఖలో కూడా సేవలందించారు. అక్కినేని నాగేశ్వరరావు నిర్మించిన సుడిగుండాలు చిత్రానికి సత్యమూర్తి ఆర్ట్ డైరక్షన్ నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వ లలితకళా అకాడమీకి ఐదు సంవత్సరాలు కౌన్సిల్ సభ్యుడిగా సేవలందించారు. చదువుల్రావ్ పేరుతో ఆయన సృష్టించిన కార్టూన్ పాత్ర వ్యంగ్య చిత్రజగతిలో అజరామరం. 1939 జనవరి 1న రామచంద్రపురంలో సత్యమూర్తి జన్మించారు. ఆయనకు భార్య జోగేశ్వరి, కూతురు ఆచార్య పద్మావతి ఉన్నారు. కుమారుడు సాయి భాస్కర్ ఇటీవల దివంగతులయ్యారు. సత్యమూర్తి మరణం తీరని లోటని ప్రముఖ కార్టూనిస్టులు పేర్కొన్నారు. సత్యమూర్తి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్‌కు సోదరుడు.