మామిళ్లగూడెం, మార్చి 11 : ఓ బార్‌కు సంబంధించి లైసెన్స్ కాపీల జిరాక్స్ కోసం యజమాని నుంచి లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన ఖమ్మంలో మంగళవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ రమేశ్ కథనం ప్రకారం.. ఖమ్మంలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఓ యజమాని తన బార్‌కు లైసెన్స్ కాపీలు జిరాక్స్ కావాలని జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న భూక్యా సోమ్లానాయక్‌ను సంప్రదించాడు. రూ.1,500 ఇవ్వాలని చెప్పడంతో ఆ మొత్తం ఇచ్చేందుకు బాధితుడు ఒప్పుకున్నాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి పరిస్థితిని వివరించాడు. వారు పన్నిన పథకం ప్రకారం తన కార్యాలయంలో రూ.1,500 లంచం తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు సోమ్లానాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కేసు నమోదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పని చేసేందుకు లంచం అడిగితే బాధితులు నేరుగా టోల్‌ఫ్రీ నంబర్ 1064లో సంప్రదించాలని సూచించారు.