హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): కరెంటు, తాగునీటి కొరత ఉన్నదని ఉస్మానియా వర్సిటీ నుంచి విద్యార్థులను ఖాళీ చేసి ఇండ్లకు పంపడం అత్యంత హేయమైన, దుర్మార్గమైన చర్య అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు, తాగునీటి కొరత ఉన్నదని చెప్పడానికి ఉస్మానియా యూనివర్సిటీ అతిపెద్ద సాక్ష్యమన్నారు.
ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పాలనలో వందేండ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చీకటి రోజులు వచ్చాయని విమర్శించారు. కరెంటు కొరత, నీళ్ల కొరత ఉన్నదని విద్యార్థులను పంపించిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులను, ఉస్మానియాలో చదివే విద్యార్థులను వెళ్లగొట్టడం దారుణమైన చర్య అని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవి? అని విద్యార్థులు ప్రశ్నిస్తారన్న భయంతోనే హాస్టళ్లను మూసివేశారని ఆరోపించారు. ఇంకా పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు పూర్తి కాకుండానే సెలవులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఓయూలో నెలకొన్న దారుణ పరిస్థితులకు రేవంత్, భట్టి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు.