ఖమ్మం, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చదువంటే ఆ విద్యార్థికి ప్రాణం. చిన్నప్పటి నుంచి అన్నింట్లోనూ ఫస్టే. ఉన్నత చదువులతో కుటుంబానికి ఆసరాగా నిలవాలకున్నాడు. కానీ ఆ నిరుపేద విద్యార్థి చదువుకు డబ్బు సమస్య అడ్డంపడ్డది. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని తీసుకొచ్చారు. దానికి దరఖాస్తు చేసుకొని ఆస్ట్రేలియా బాట పట్టాడు.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రేగులచలకకు చెందిన మాగంటి సాయి అరవింద్. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబంలో జన్మించిన సాయి అరవింద్.. తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. కానీ, విద్యానిధి పథకం అతడి జీవితాన్ని మార్చేసింది. స్కాలర్షిప్ రావటంతో 2018 జూలైలో విమానం ఎక్కి ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ మాస్టర్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ చదువుతున్నాడు. దీనిపై సాయిఅరవింద్ తల్లి మాగంటి నాగేంద్ర మాట్లాడుతూ.. ‘నా కొడుకును సీఎం కేసీఆర్ ఆస్ట్రేలియా పంపిండు’ అని సంతోషంగా చెప్పింది. సాయి అరవింద్ చిన్నప్పటి నుంచీ బాగా చదువుతుండేవాడని, పైచదువులు చదివి తమకు ఆసరా అవుతాడనే నమ్మకం ఉండేదని, అందుకు సీఎం కేసీఆర్ విద్యానిధి పథకంతో ఆదుకొన్నారని తెలిపింది. ‘రూ.20 లక్షల స్కాలర్షిప్, విమాన టికెట్కు రూ.50 వేలు, వీసా చార్జీలు కూడా తెలంగాణ సర్కారే ఇచ్చింది’ అని చెప్పింది.