ఉప్పల్/ హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ హయాంలోనే అన్ని రంగాల్లో బీసీలకు సమ ప్రాధాన్యం దక్కుతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నదని వెల్లడించారు. ఉప్పల్ భగాయత్‌లో ఎకరా స్థలం, రూ.కోటి నిధులతో నిర్మించ తలపెట్టిన దేవాంగ కుల ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులకు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి గంగుల బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గంగుల మాట్లాడుతూ.. ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలతో బీసీల నూతన శకం ఆరంభమైందని అన్నారు. 74 ఏండ్ల స్వాతంత్య్ర చరిత్రలో బీసీల కోసం ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమం కేసీఆర్ చేస్తున్నారని కొనియాడారు. గతంలో కనీస వసతికి బీసీలకు గుంట జాగ కూడా ఇవ్వలేదని, అలాంటిది సీఎం కేసీఆర్ నగరం నడిమధ్యన 41 కులాలకు వేల కోట్ల విలువ చేసే 83 ఎకరాల స్థలాలను, భవన నిర్మాణానికి 90 కోట్లు కేటాయించారని వివరించారు. ఏక సంఘంగా ఏర్పడిన 15 కులాలకు ఇప్పటికే భవన నిర్మాణ అనుమతి పత్రాలు మంజూరు చేశామని గుర్తుచేశారు. మిగతా బీసీ కుల సంఘాలు ఏక సంఘంగా ఏర్పడాలని సూచించారు. నాగరికతకు ఉతమిచ్చే కులాలను సీఎం కేసీఆర్ గుర్తించి, వాటికి అండగా నిలబడ్డారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులు శ్రీకాంత్‌గౌడ్, ఉపేందర్, దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చోళ రాజేశ్వర్, తొగర్ల చిరంజీవులు, దొంతంశెట్టి వెంకటమనోహర్, మావూరి వెంకటరమణ, బొమ్మన దుర్గాప్రసాద్‌రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.